వికారాబాద్, మార్చి 22 : ఆవు చేను మేస్తే దూడ గట్టున మేస్తదా.. అన్న చందంగా తయారైంది బీజేపీ నేతల తీరు. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయగా, వికారాబాద్ జిల్లాకు చెందిన ఆ పార్టీ నేత సాయికృష్ణ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ వక్రబుద్ధి చూపించాడు. న్యాయవాదిగా ఉన్న వికారాబాద్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత సాయికృష్ణ వద్దకు భూ సమస్య విషయమై వచ్చిన అక్కాచెల్లెళ్లను లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. నేరుగా బాధితుల ఇంటికెళ్లి మహిళతోపాటు భర్తను గన్‌తో బెదిరించి లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. సాయికృష్ణ వేధింపులతో, బెదిరింపులతో తమకు రక్షణ కల్పించాలంటూ వికారాబాద్ పోలీస్ స్టేషన్‌తోపాటు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సదరు బీజేపీ నేతపై ఫిర్యాదు చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం… బాధితురాలి అమ్మమ్మ, తాతయ్య పేరు మీద ఏడెకరాల భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి బాధితురాలి తల్లి, మేనమామ మధ్య గొడవ జరుగుతుంది. ఈ విషయమై బాధితురాలి తల్లి కోర్టులో కేసు వేసింది. అయితే వికారాబాద్ బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి, (గతంలో వికారాబాద్‌లో డీఎస్పీ, అదనపు ఎస్పీగా పని చేశారు) న్యాయవాది కావడంతో సాయికృష్ణకు కేసు అప్పగించారు.
బాధితురాలికి మరో ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. కేసు విషయం పక్కన పెట్టి బాధితురాలి సోదరికి తరచూ ఫోన్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. విసుగు చెందిన ఆమె సాయికృష్ణ ఫోన్‌ను బ్లాక్ లిస్టులో పెట్టింది. అనంతరం బాధితురాలికి ఫోన్ చేసి కేసు విషయమై తరచూ మాట్లాడుతూ లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. ఒప్పుకోకపోవడంతో ఈ నెల 12న రాత్రి 11 గంటల ప్రాంతంలో సాయికృష్ణ బాధితురాలి ఇంటికొచ్చి బూతులు తిడుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. తన భర్త తలపై తుపాకీ పెట్టి చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. మరుసటి రోజు భర్తతో కలిసి 13న పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేయలేదు. ఎన్సీఆర్లో పెట్టినట్లు ఫోన్‌కు మెసేజ్ వచ్చిందన్నారు. బీజేపీ నేత సాయికృష్ణ నుంచి వేధింపులు ఎక్కువ అవుతున్నాయని, మాకు రక్షణ కల్పించి ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా సాయికృష్ణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.