వికారాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : రేషన్ దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేసే సన్నబియ్యంపై పర్యవేక్షణ కరువైంది. పేదలందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని పెద్దఎత్తున ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత పర్యవేక్షణ బాధ్యతలను విస్మరించింది. ఈ ఏడాది మార్చిలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. మొదట రెండు, మూడు నెలలు నాణ్యతతో కూడిన సన్న బియ్యాన్ని పంపిణీ చేసినప్పటికీ.. ఆ తర్వాత క్వాలిటీ లోపించిందనే అభిప్రాయం పేదల నుంచి వ్యక్తమవుతున్నది. సర్కారుతోపాటు సంబంధిత పౌరసరఫరాల శాఖ అధికారులు పర్యవేక్షించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రేషన్ దుకాణాలకు పంపిణీ చేసే సమయంలో బియ్యం క్వాలిటీ పరిశీలించాల్సిన సంబంధిత అధికారులు మిల్లర్లతో కుమ్మక్కై నాణ్యత లేకున్నప్పటికీ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. క్వాలిటీ తగ్గడంతో లబ్ధిదారులు బియ్యాన్ని బ్లాక్మార్కెట్లో విక్రయిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది.
ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసిన తర్వాత ధాన్యాన్ని మిల్లర్లకు అప్పజెప్పితే సంబంధిత ధాన్యాన్ని మిల్లర్లు సీఎంఆర్ బియ్యం రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. బియ్యం అందజేయడంలోనే మిల్లర్లు మాయాజాలం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మిల్లర్లు ఇచ్చే మామూళ్ల మత్తులో ఉన్న పౌరసరఫరాల శాఖ అధికారులు రెండు, మూడు సీజన్ల సీఎంఆర్ బియ్యం ఇవ్వకపోయినా పట్టించుకోకపోవడం.. క్వాలిటీ కూడా పరిశీలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రేషన్ దుకాణాల్లో ప్రస్తుతం పంపిణీ చేసే సన్నబియ్యానికి సంబంధించి జిల్లాలో పండించే సన్నబియ్యం ఒక నెలలో రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసేందుకు కూడా సరిపోయే పరిస్థితులు లేకపోవడంతో ఇతర జిల్లాల నుంచి సన్నబియ్యాన్ని దిగుమతి చేసుకొని రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. జిల్లాకు మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్‌నగర్, గద్వాల జిల్లాల నుంచి సన్నబియ్యం దిగుమతి అవుతుంది. సన్నబియ్యాన్ని సిద్ధం చేసే ముందు జిల్లా పౌరసరఫరాల అధికారులు సంబంధిత బియ్యం క్వాలిటీని పరిశీలించి, ఆ తర్వాతే సరఫరాకు అనుమతిస్తారు. ఈ విధంగా చెప్పుకొనేందుకు బాగానే ఉన్నా గత మూడు, నాలుగు నెలలుగా రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తున్న సన్నబియ్యం నాణ్యతను చూస్తే మాత్రం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని మెజార్టీ రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం క్వాలిటీ లేకపోవడంతో రేషన్ డీలర్లను ప్రజలు నిలదీస్తున్నారు. సర్కారు సరఫరా చేస్తే తాము పంపిణీ చేస్తున్నామని, వాస్తవానికి క్వాలిటీలేని సన్నబియ్యం వస్తున్నదని జిల్లాలోని పలువురు రేషన్ డీలర్లు చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వ లక్ష్యం నీరుగారకుండా ఉండాలంటే నాణ్యతతో కూడిన సన్నబియ్యాన్ని పంపిణీ చేయాలని ప్రజలు సర్కారును డిమాండ్ చేస్తున్నారు. గతంలో రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెలా 5600 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తుండగా, కొత్త రేషన్‌కార్డులతోపాటు కొత్తగా చేర్చిన యూనిట్లతో జిల్లాకు సరఫరా అయ్యే బియ్యం కోటా 5780 మెట్రిక్ టన్నులకు పెరిగింది. జిల్లాలో రేషన్‌కార్డుల సంఖ్య 2,48,475 ఉండగా.. 8,87,912 మంది లబ్ధిదారులున్నారు. వీటిలో అంత్యోదయ కార్డులకు సంబంధించి 26,621 కార్డులకుగాను 79,524 మంది లబ్ధిదారులు, అన్నపూర్ణ కార్డులకు సంబంధించి 41 మంది సభ్యులు, ఆహార భద్రత కార్డులకు సంబంధించి 2,21,818 కార్డులుండగా, 8,08,347 మంది లబ్ధిదారులున్నారు.