రంగారెడ్డి, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని యాచారం మండల రైతులకు భూసేకరణ పేరుతో కొంతకాలంగా కంటిపై కునుకు లేకుండా పోతున్నది. మండలంలోని రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుండగా.. ఉన్న భూములను ప్రభుత్వం వివిధ అవసరాల నిమి త్తం తీసుకుంటుండడంతో వారు ఉపాధి కోల్పో యి దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు.
కొత్తగా మరో 900 మంది రైతులు భూసేకరణకు సహకరించడం లేదని కోర్టు నుంచి రైతులకు నోటీసులు జారీ అయ్యాయి. రైతులే స్వయంగా వచ్చి కోర్టు లో భూములను ఎందుకు ఇవ్వరో చెప్పాలని నోటీసులు జారీ చేయడంతో రైతులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొన్నది. గత కేసీఆర్ హయాంలో రైతులు పదివేల ఎకరాల భూ ములను ఫార్మాసిటీ ఏర్పాటుకు ఇచ్చారు.
కాగా, మరో 2,211 ఎకరాలు ఫార్మాసిటీకి సేకరించిన భూముల మధ్యలో ఉండడంతో అన్నదాతలు ఆ భూములను ఇచ్చేందుకు నిరాకరించారు. అయి తే ఆ భూములకు సంబంధించి ఎకరాకు రూ.8 లక్షల చొప్పున ప్రభుత్వం రైతులకు తెలియకుండానే అథారిటీలో పరిహారం డబ్బులను జమచేసింది.
కాగా, ఇటీవల ప్రభుత్వం 2,2 11 ఎకరాలకు సంబంధించి భూములు ప్రభుత్వానికే చెందుతాయని ఇప్పటికే, పరిహారాన్ని అథారిటీలో జమచేశామని, పట్టా భూముల్లో కం చె వేస్తున్నారు. ఈ విషయమై రైతులు కోర్టును ఆశ్రయించగా వివాదంలో ఉన్న భూముల వద్దకు వెళ్లొద్దని, కంచె ఏర్పాటు చేయొద్దని న్యాయస్థా నం ఆదేశించింది. ఆ ఆదేశాలను పట్టించుకోకుం డా రెవెన్యూ అధికారులు పోలీసు పహారాలో ఫెన్సింగ్ వేస్తున్నారు.
900మంది రైతులకు కోర్టు నోటీసులు..
యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చెందిన 2,211 ఎకరాల పట్టా భూములను భూసేకరణకు ఇవ్వబోమని రైతులు మొదటి నుంచీ చెబుతూనే ఉన్నారు. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రస్తుత మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, ఎమ్మెల్యే రంగారెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తదితరులు రైతుల వద్దకెళ్లి తాము అధికారంలోకి రాగానే 2,211 ఎకరాల పట్టా భూములను మీకే ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.
కానీ, ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు దాటినా రైతుల భూములను వారికి ఇప్పించకపోగా.. ఆ భూముల్లో పోలీస్ పహారాలో రెవెన్యూ అధికారులు కంచెను ఏర్పాటు చేస్తున్నారు. తమ భూము ల్లో ఫెన్సింగ్ వేయొద్దని రైతులు అడ్డుకుంటుండడంతో ప్రభుత్వం కోర్టుకు వెళ్లగా.. నాంపల్లి సిటీ సివిల్ కోర్టు పై గ్రామాలకు చెందిన సుమారు 900 మంది రైతులకు నోటీసులు పంపించింది.
ఈ భూములను ప్రభుత్వం తీసుకుని పరిహారాన్ని అథారిటీలో జమ చేసినందున ఈ భూములు ప్రభుత్వానికే వర్తిస్తాయని.. పరిహారం తీసుకుని సహకరించాలని, లేని పక్షంలో ఎందుకు భూములను ఇవ్వరో స్వయంగా వచ్చి కోర్టుకు చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నది. దీంతో మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చెందిన రైతులు ప్రతిరోజూ నాంపల్లి కోర్టుకెళ్లి తమ భూములను ఇవ్వబోమని చెబుతూనే ఉన్నా.. రెవెన్యూ అధికారులు మాత్రం పోలీ స్ పహారాలో ఆ భూముల చుట్టూ కంచె ఏర్పాటు పనులను చురుగ్గా చేసేస్తున్నారు.
మరిన్ని రోడ్ల కోసం భూసేకరణ..
యాచారం మండలంలో ఇప్పటికే ఫార్మాసిటీ కోసం 10,000 ఎకరాలను ప్రభుత్వం తీసుకున్నది. అలాగే, ఇటీవల ఫ్యూచర్‌సిటీ గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ఏర్పాటు కోసం యాచారం మండలంలోని కుర్మిద్ద, నానక్‌నగర్ గ్రామాల నుంచి సుమారు మూడు వందల ఎకరాలకు పైగా తీసుకోనున్నారు. ఈ భూములకు సంబంధించి పరిహారంపై ప్రభుత్వం రైతులను మోసగిస్తున్నదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మార్కెట్ ధర ప్రకారం పరిహారం ఇస్తామని ప్రభుత్వం చెబుతుండగా.. ఈ గ్రామాల్లో మార్కెట్ విలువ చాలా తక్కువగా ఉందని..దానిని ఆధారంగా చేసుకుని చెల్లిస్తే తమకు ఆశించిన స్థాయిలో పరిహారం అందదని రైతులు వాపోతున్నారు. అలాగే, ఫార్మాసిటీకోసం నాగార్జునసాగర్- హైదరాబాద్ రహదారి నుంచి మరో రోడ్డు వేయాల్సి ఉన్నది. దీనిని గతంలో యాచారం సమీపంలోని వేంకటేశ్వరగుట్ట నుంచి నందివనపర్తి మీదుగా పిల్లిపల్లి వరకు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
కానీ, ఈ రోడ్డుకు భూసేకరణ జరపాల్సి ఉండడంతో రైతులు అంగీకరించడంలేదు. దీంతో సాగర్ రోడ్డు నుంచి తక్కళ్లపల్లి వరకు ఉన్న ప్రస్తుత సింగిల్ లేన్‌ను లేన్ల రోడ్డుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రోడ్డుకిరువైపులా ఉన్న భూములను తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. అలాగే, ఫ్యూచర్‌సిటీ నుంచి అమరావతి వరకు ఏర్పాటు చేయాలనుకున్న 12 లేన్ల రోడ్డు కూడా మేడిపల్లి మీదుగా సాగర్ రోడ్డుకు వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యారు. ఈ రోడ్లతోనూ యాచారం మండలంలోని భూ ములను రైతులు కోల్పోవల్సి వస్తున్నది.
అడ్డుకుంటే అరెస్టులే..
ప్రభుత్వ పరిహారం వద్దని.. తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చే ప్రసక్తే లేదని.. భూముల్లో ఫెన్సింగ్ ఏర్పాటు పనులను అడ్డుకుంటున్న రైతులపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. రైతులను పలు ఠాణాలకు తరలించి.. కంచె ఏర్పాటు పనులను పూర్తి చేస్తున్నారు. రైతులు చేసేదేమీ లేక కోర్టులను ఆశ్రయిస్తున్నారు. గ్రామాల్లో భారీ పోలీస్ బందోబస్తుతో గత నెలరోజులుగా ఫెన్సింగ్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి.