హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): బీహెచ్ఈఎల్ ఉద్యోగుల సొంతింటి కలను ఆసరా చేసుకొని సాగించిన భారీ కుంభకోణంపై దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కీలక అడుగు వేసిం ది. ‘వివేకానంద బీహెచ్ఈఎల్ ఎంప్లాయీస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ’లో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టిన ఈడీ.. సుమారు రూ.16.35 కోట్ల విలువైన ఐదు స్థిరాస్తులను తాతాలికంగా జప్తు చేసింది. ము త్తంగి గ్రామంలో గృహ నిర్మాణ ప్రాజెక్టు కోసం 316 మంది సభ్యుల నుంచి దాదాపు రూ.18.09 కోట్లను సొసైటీ వసూలు చేసింది.
అయితే, ఈ నిధులను సభ్యుల ప్రయోజనాల కోసం కాకుండా, సొసైటీ ప్రెసిడెంట్ డీ శ్రీనివాసరావు, ట్రెజరర్, ఇతర పాలకమండలి సభ్యులు పకదారి పట్టించారు. బిల్డర్ సంస్థ అయిన త్రిభ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి పీ గోవర్ధన్‌రెడ్డితో చేతులు కలిపి సొమ్మును వ్యక్తిగత ఖాతాలకు మళ్లించారు. ఈ నిధులతో కొనుగోలు చేసిన భూములను బిల్డర్, సొసైటీ ప్రెసిడెంట్ తమ వ్యక్తిగత ఆస్తులుగా మార్చుకున్నారు. ఈ క్రమంలో దాదాపు రూ.17.31 కోట్ల మేర నగదు నేరపూరితంగా చేతులు మారినట్టు ఈడీ నిర్ధారించింది. బాధిత సభ్యుల ఫిర్యాదు మేరకు తొలుత సైబరాబాద్‌లోని రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా.. ఈడీ రంగంలోకి దిగి మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టింది. 2025 జూలైలో పోలీసులు సమర్పించిన చార్జిషీటు ఆధారంగా తాజాగా ఈ జప్తు ప్రక్రియను పూర్తి చేసింది.