హైదరాబాద్, ఫిబ్రవరి 6(నమస్తే తెలంగాణ): సినిమాల పైరసీ కేసులో అరెస్టయి న ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. తదుపరి విచారణ జరిగే ఈ నెల 9లోగా పోలీసులు పిటిషనర్ పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నదీ లేనిదీ చెప్పాలని ఆదేశించింది. సినిమా పైరసీలకు పాల్పడినాడంటూ పలువురు చేసిన ఫిర్యాదుల మేరకు నమోదైన కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలంటూ రవి వేర్వేరుగా వేసిన వ్యాజ్యాలను జస్టిస్ కే సుజన శుక్రవారం విచారించారు. కేసుల దర్యాప్తు పూర్తయినందున బెయిల్ మంజూరు చేయాలని రవి న్యాయవాది కోరారు. పిటిషనర్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారణ కూడా చేశారని తెలిపారు. దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌కు ఇండియన్ పాస్‌పోర్టుతోపాటు ఐర్లాండ్ పాస్‌పోర్టు కూడా ఉన్నందున బెయిల్ ఇస్తే విదేశాలకు పారిపోవచ్చని చెప్పారు. ఇదే జరిగితే విచారణ కష్టమన్నారు. అతని పాస్‌పోర్టును పోలీసులు గతంలోనే స్వాధీనం చేసుకున్నారని పిటిషనర్ న్యాయవాది చెప్పగా, అధికారిక సమాచారం తెలుసుకొనేందుకు గడువు కావాలని పీపీ కోరారు. తదుపరి విచారణ ఈ నెల 9వ తేదీకి వాయిదా పడింది