బడంగ్‌పేట, జనవరి 4 : మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రణాళికబద్ధంగా చెరువులను అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్రపు డెక్కను కూడా తొలగించలేకపోతున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి ఆరోపించారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్ద చెరువు సమీపంలో రూ.1.80కోట్లతో క్రీడా ప్రాంగణానికి శనివారం ఆమె శంకుస్థాపన చేశారు. చెరువు చుట్టూ ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ను పరిశీలించారు. క్రీడా ప్రాంగణానికి సంబంధించి అధికారులు తయారుచేసిన మ్యాప్‌ను పరిశీలించారు.
వాకింగ్ ట్రాక్, బ్యాడ్మింటన్ టెన్నిస్‌కోర్టు, చిల్డ్రన్ గేమ్‌కు సంబంధించిన వాటిని అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజకవర్గంలో పది చెరువులను కోట్లాది రూపాయలతో సుందరీకరణ చేశామన్నారు. గతంలో చెరువులను అభివృద్ధి చేయడానికి కేసీఆర్, కేటీఆర్ సహకారంతో కోట్లాది రూపాయలు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. చెరువుల్లో ఉన్న గుర్రపు డెక్కను తొలగించాలని ప్రభుత్వానికి రెండుసార్లు లేఖ రాశామని తెలిపారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు.
అల్మాస్‌గూడలో చెరువు సుందరీకరణ పనులు మధ్యలోనే నిలిపివేశారన్నారు. ప్రభుత్వం నిధులు నిలిపివేయడంతో చాలా చోట్ల పనులు మధ్యలోనే ఆగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహేశ్వరం నియోజక వర్గానికి వచ్చిన రూ. 279 కోట్లు వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై కోపంతో నిధులివ్వకపోతే ప్రజలు ఇబ్బంది పడుతారన్నారు. కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ విక్రంరెడ్డి, కమిషనర్ పాల్గొన్నారు.