యాచారం, జూన్ 4 : విద్యుత్ ప్రమాదాలతో ప్రజలు, రైతులు, మూగ జీవాల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. వానాకాలం సందర్భంగా గాలివానకు విద్యుత్ స్తంభాలు విరిగిపడడం, విద్యుత్ వైర్లు తెగిపడడం, తీగలు కిందకు వాలిపోవడంతో విద్యుత్ ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. ప్రమాదాల నివారణకు తగు జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ శాఖ అధికారులు తెలుపుతున్నారు. రైతులు ఇప్పటికే జోరుగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. వ్యవసాయ బావుల మోటార్లు, స్టార్టర్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు పలు జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాల నుంచి రక్షించుకోవచ్చని తెలుపుతున్నారు.
మండలంలో వ్యవసాయ పొలాల వద్ద పశువులు, రైతులు మృతి చెందిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. వర్షాలు పడినప్పుడు, ఇతర సమయాల్లో విద్యుత్ తీగలు తెగిపడడం, విద్యుత్ స్తంభాలు విరిగిపడి విద్యుత్ సర ఫరా జరగడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఇంట్లో తీగలపై దుస్తులు ఆరవేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
వర్షానికి తడిసిన గోడలను, విద్యుత్ స్తంభాలను ముట్టుకోకూడదు. విద్యుత్ సరఫరా, ప్రమాదాల సమయాల్లో టోల్ ఫ్రీ. నంబర్ 18004250028, హెల్ప్ లైన్ 1912 సం బర్, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలని తెలుపుతున్నారు. విద్యుత్ ప్రమాదాలపై అధికారులు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
వ్యవసాయ బావుల వద్ద మోటార్లు, స్టార్టర్లను తడి చేతులతో తాకొద్దు.
మోటార్లలో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు సొంతంగా మరమ్మతులు చేయకుండా సంబంధిత మెకానిక్ ను సంప్రదించాలి.
విద్యుత్ సరఫరాలో సమస్యలు ఎదురైనప్పుడు రైతులు, ప్రజలు విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వాలి.
మోటార్ల వద్ద స్టార్టర్లను చెక్క బాక్సులో ఎత్తుగా ఏర్పాటు చేసుకోవాలి.
మోటార్లకు నేరుగా విద్యుత్ సరఫరా కాకుండా మధ్యలో ఫ్యూజ్ బాక్స్ ఏర్పాటు చేసుకోవాలి.
వర్షాలకు తెగిపడిన విద్యుత్ తీగలు, కూలినస్తంభాలల వద్ద విద్యుత్ సరఫరా అయితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి.
ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసుకున్న ఇనుప రేకులకు విద్యుత్ సరఫరా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇనుప తీగలను దండాలుగా కట్టు కోవద్దు.
పశువులు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు, తీగల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలి.
ప్రతి ఇంట్లో వైరింగ్ కోసం నాణ్యమైన ఉత్పత్తులను వినియోగించాలి. ముందస్తు జాగ్రత్తగా తప్పకుండా ఎర్తింగ్ చేసుకోవాలి
చేతులతో ప్లగ్లు, మోటార్లను ముట్టుకోవద్దు. చార్జింగ్ పెట్టి సెల్ ఫోన్ లో మాట్లాడొద్దు.
విద్యుత్ షాక్ కు గురైన వ్యక్తిని ముట్టుకోకుండా, అతడిని విద్యుత్ తీగల నుంచి వేరు చేసేందుకు కర్ర, పాస్టిక్ వస్తువులతో ప్రయత్నించాలి.
వ్యవసాయ క్షేత్రాల వద్ద నాణ్యత గల పంపుసెట్లను వినియోగించాలి.
ఇంట్లో, వ్యవసాయ పొలాల వద్ద విద్యుత్ వైర్లు ఫెయిల్ అయిన వాటిని గుర్తించి నాణ్యమైన కొత్తవి వినియోగించాలి.
పంట పొలాల చుట్టూ విద్యుత్ తీగల కంచెను ఏర్పాటు చేయవద్దు.
విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయడం చట్టరీత్యా నేరం.
మోటారు రిపేర్లు అర్హత గల మెకానిక్ తో మాత్రమే చేయించాలి.
తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ వైర్లను గుర్తించి అధికారులకు చెప్పాలి.
ట్రాన్స్ఫార్మర్లకు కంచె ఏర్పాటు చేసుకోవాలి.
విద్యుత్ సిబ్బందితో కాకుండా సొంతంగా మరమ్మతులు చేయకూడదు.
వర్షాకాలం విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉంటూ ప్రమాదాల బారిన పడకుండా అవగాహనతో జాగ్రత్తలు పాటించాలి. విద్యుత్ స్తంభాలు కూలడం, విద్యుత్ తీగలు తెగి పడడం వంటివి జరిగితే వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం అందించాలి. రైతులు వ్యవసాయ బావుల వద్ద ఏర్పాటు చేసిన మోటార్ల వద్ద తడి చేతులతో ముట్టుకోకుం డా జాగ్రత్తలు పాటించాలి. అతుకులు గల పాత వైర్లకు బదులుగా కొత్త వైర్లను ఏర్పాటు చేసుకోవాలి.