షాబాద్, జూలై 6: రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ అన్నారు. ఆదివారం షాబాద్ మండల పరిధిలోని రేగడిదోస్వాడ గ్రామంలో బీసీసేన మండల అధ్యక్షుడు కమ్మరి దయాకర్ చారి ఆధ్వర్యంలో బీసీసేన గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా సత్యనారాయణ చారి, ఉపాధ్యక్షుడిగా కురుమ శ్రీశైలంలను ఎన్నుకొని నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ మాట్లాడుతూ..జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలు అన్ని రంగాలలో వెనుకబడి పోతున్నారని తెలిపారు. బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా మండల, జిల్లా, రాష్ట్రస్థాయి నుంచి బీసీ సేన కమిటీలు ఏర్పాటు చేసి, బీసీలు రాజ్యాధికారం దిశగా పయనించాలని, అందుకే మహిళా కమిటీలను సైతం ప్రోత్సహిస్తూ మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేశాకే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. పార్టీలకతీతంగా బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి తమ హక్కుల సాధన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సేన రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వు సుధాకర్, మండల ఉపాధ్యక్షుడు బాలరాజ్, షాద్ నగర్ మండల బీసీ సేన మహిళా ఉపాధ్యక్షురాలు జలజ, షాబాద్ మండల యూత్ అధ్యక్షుడు బండ అజయ్ కుమార్, బీసీ సేన నాయకులు గుండాల శ్రీనివాస్, మధుసూదన్, బండ కుమార్, మల్లేష్, మచ్చేందర్, రాఘవేందర్, మహేందర్, విఠల్, జయ, శ్రీకాంత్, స్రవంతి, తదితరులు పాల్గొన్నారు.