వికారాబాద్ జిల్లాలో స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) మహిళలు ఆర్థికంగా ముందడుగు వేస్తున్నారు. ప్రభుత్వం అందించిన రుణాలతో స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 10375 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద రూ.463.17కోట్లు రుణాలుగా ఇవ్వాలని అధికార యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు రూ.386.88కోట్లు రుణాలు పంపిణీ చేశారు. అంటే టార్గెట్‌లో 83.53 శాతం రుణాలను ఎస్‌హెచ్‌జీలకు అందించి లక్ష్యానికి చేరువలో ఉన్నారు.
-పరిగి, జనవరి 3
పరిగి, జనవరి 3 : స్వయం సహాయక సంఘాల మహిళలు వ్యాపార రంగంలో మరింత అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం వారికి బ్యాంకు లింకేజీ కింద రుణ సదుపాయం కల్పిస్తున్నది. ప్రతి సంవత్సరం నిర్దేశించిన లక్ష్యం మేరకు రుణాలు ఇప్పించడంతోపాటు వాటి రికవరీని సైతం ప్రత్యేకంగా తీసుకోవడంతో వికారాబాద్ జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా ముందడుగు వేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 2023-24లో వికారాబాద్ జిల్లా పరిధిలోని 19 మండలాల్లో 10375 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద రూ.463.17 కోట్లు రుణాలుగా ఇప్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
జనవరి 2వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 5336 స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీ కింద రూ.386.88 కోట్లు రుణాలుగా ఇచ్చారు. తద్వారా రాష్ట్రంలోనే వికారాబాద్ జిల్లా బ్యాంకు లింకేజీ రుణాలు ఇప్పించడంలో పదో స్థానంలో కొనసాగుతున్నది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పూర్తిస్థాయిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రుణాలు సక్రమంగా చెల్లిస్తున్న స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీ కింద రుణ సదుపాయాలతో గ్రామీణ మహిళలు మరింత ఆర్థిక వృద్ధి సాధిస్తున్నారు.
మహిళలు బ్యాంకు లింకేజీ రుణాలు పొంది కిరాణ దుకాణాలు, ఆవులు, గేదెలు, టైలరింగ్ యూనిట్లు, వ్యవసాయ పరికరాలు, ఇతర వాటి ఏర్పాటుకు వినియోగించుకుంటున్నారు. ఇచ్చిన లక్ష్యం మేరకు స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు ఇప్పించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపు లోపే లక్ష్యం కంటే అధికంగా రుణాలు ఇప్పించేలా ప్రణాళికాబద్దంగా పనిచేస్తున్నారు.
ఇదిలావుండగా జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇచ్చిన రుణాలను తిరిగి చెల్లించడంలోనూ జిల్లా మంచి స్థానంలోనే ఉంది. రుణాలు సద్వినియోగం చేసుకొని ఆర్థిక ప్రగతి సాధించడంతోపాటు 97 శాతం రికవరీతో ముందున్నది. తద్వారా బ్యాంకర్లు సైతం స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేస్తే రికవరీ రేటు సైతం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
వికారాబాద్ జిల్లా పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లింకేజీ కింద రూ.463.17 కోట్లు రుణాలుగా ఇప్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. జనవరి 2 వరకు జిల్లాలోని 5336 స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీ కింద రూ.386.88 కోట్లు రుణాలు ఇప్పించాం. రుణాలు తీసుకున్నవారు సైతం సక్రమంగా చెల్లిస్తున్నారు. రుణాలు పొందినవారు సద్వినియోగం చేసుకొని ఆర్థిక ప్రగతి సాధించాలి.
– కృష్ణన్, డీఆర్డీవో