బొంరాస్పేట, ఏప్రిల్ 9;మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర సర్కార్ చేయూతనందిస్తున్నది. బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలను అందజేస్తుండడంతో గొర్రెలు, బర్రెలు, మేకలను కొనుగోలు చేసి జీవనోపాధి పొందుతున్నారు. కిరాణా దుకాణాల నిర్వహణ, చిరు వ్యాపారాలు చేస్తూ ఆర్థిక స్వావలంబన 2022-23 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 15,847 స్వయం సహాయక సంఘాలకుగాను 13,214 సంఘాలకు రూ.537 కోట్ల రుణాలు ఇవ్వాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో 8,923 సంఘాలకు రూ.506.55 కోట్ల రుణాలను పంపిణీ చేసిన అధికారులు 95 శాతం లక్ష్యాన్ని చేరుకున్నారు. తీసుకున్న రుణాల్లో 97 శాతం రికవరీ ఉండడం విశేషం. బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీలో రాష్ట్రంలోనే జిల్లాకు 10వ స్థానం దక్కడం గమనార్హం.
స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడానికి ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలను అందిస్తున్నది. మహిళా సంఘాల సభ్యులు ప్రతి నెలా పొదుపు చేసుకుంటున్నారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించిన సంఘాలకు వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తున్నది. బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు పొందిన మహిళలు సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. రుణాలను కూడా సకాలంలో తిరిగి చెల్లిస్తుండడంతో బ్యాంకులు మహిళలకు నమ్మకంగా రుణాలనిస్తున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు 95 శాతం మహిళా సంఘాలకు రూ.506 కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలను పంపిణీ చేశారు. రుణాల పంపిణీలో జిల్లా రాష్ట్రంలో పదో స్థానంలో ఉంది.
వికారాబాద్ జిల్లాలో 15847 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిలో 1,66,044 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ప్రతి నెలా మహిళలు వారు చేసుకుంటున్న పొదుపు, రికార్డుల నిర్వహణ, సంఘం సీనియారిటీని ఆధారంగా చేసుకుని ప్రభుత్వం ఏటా బ్యాంకుల ద్వారా పావలా వడ్డీకే రుణాలను అందజేస్తున్నది. ఒక్కో సంఘానికి కనిష్టంగా రూ.5 లక్షల నుంచి గరిష్టంగా రూ.10 లక్షల వరకు రుణాలిస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన సంఘాలకు రూ. లక్ష నుంచి రుణాలు ఇస్తున్నారు. బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను సంఘంలోని మహిళలు సమానంగా పంచుకుని వివిధ రకాల ఆర్థిక పెంపుదల కార్యకలాపాలను నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఒకప్పుడు అధిక వడ్డీకి వ్యాపారుల వద్ద అప్పు తీసుకుని వాటిని తిరిగి చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాలు ఎంతో ఊరటనిస్తున్నాయి. రుణాలతో గొర్రెలు, బర్రెలు, మేకలు, కిరాణా దుకాణాలు వంటి వాటిని నిర్వహిస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. తీసుకున్న రుణాలను ప్రతి నెలా వాయిదాల ప్రకారం బ్యాంకులకు తిరిగి చెల్లిస్తూ మళ్లీ కొత్తగా రుణాలు పొందుతున్నారు. బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వడం ప్రారంభమైన తరువాత స్వయం సహాయం సంఘాల మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు సాగుతున్నారు. బ్యాంకు లింకేజీ రుణాల రికవరీ శాతం 97 శాతంగా ఉంది.
8923 సంఘాలకు రూ.537 కోట్ల రుణాలు పంపిణీ
స్వయం సహాయక సంఘాలకు గతంలో కంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం అధిక మొత్తంలో రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. గత ఏడాది జిల్లాలోని 13214 మహిళా సంఘాలకు రూ.537 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. ఇందుకుగాను అధికారులు 8923 సంఘాలకు రూ.506.55 కోట్ల రుణాలను పంపిణీ చేసి 95 శాతం లక్ష్యాన్ని చేరుకున్నారు. బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీలో జిల్లా రాష్ట్రంలో 10వ స్థానంలో ఉంది. రుణాల రికవరీ కూడా సంతృప్తికరంగా ఉంది. బ్యాంకు రుణాలు తీసుకున్న స్వయం సంఘాల మహిళలు సకాలంలో వాటిని తిరిగి చెల్లిస్తుండడంతో ప్రభుత్వం ఆయా సంఘాలకు వడ్డీని తిరిగి చెల్లిస్తున్నది. తీసుకున్న రుణాలను వాయిదాల రూపంలో చెల్లించనివారి శాతం 2021-22 సంవత్సరంలో 8 శాతం ఉండేది. ఈ విషయంపై ఐకేపీ సిబ్బంది మహిళల్లో అవగాహన కల్పించి రుణ వాయిదాలను తిరిగి చెల్లించనివారి శాతాన్ని ఈ ఆర్థిక సంవత్సరం అంతానికి 3 శాతానికి తగ్గించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దీనిని 2 శాతంలోపే ఉండేలా అధికారులు కృషి చేస్తున్నారు. మహిళా సంఘాలలోని మహిళల పిల్లలకు(నిరుద్యోగులకు) ఉన్నతి పథకం ద్వారా స్వయం ఉపాధిలో శిక్షణ కూడా ఇస్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వం మహిళలకు రుణాలు అందించి వారి ఆర్థికాభ్యున్నతికి తోడ్పాటు అందించడంతో పాటు వారి పిల్లల జీవనోపాధికి కూడా శిక్షణ ఇస్తూ దారి చూపిస్తున్నది.
95 శాతం బ్యాంకు లింకేజీ రుణాలు అందించాం : వీరయ్య, డీపీఎం
వికారాబాద్ జిల్లాలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నిర్దేశించిన మేరకు 8923 సంఘాలకు రూ.506.55 కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు అందించి 95 శాతం లక్ష్యం చేరుకున్నాం. రుణాల రికవరీ కూడా బాగుంది. 97 శాతం రుణాలను తిరిగి చెల్లించారు. ఎన్పీఎను కూడా గతంలో కంటే గత ఆర్థిక సంవత్సరంలో బాగా తగ్గించాం. ఈ సంవత్సరంలో దీనిని 2 శాతంలోపు ఉండేలా ప్రయత్నిస్తున్నాం. రుణాలు పొందిన మహిళలకు ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో తగిన శిక్షణ కూడా ఇస్తున్నాం. సంఘాలలోని మహిళల పిల్లలు నిరుద్యోగులుగా ఉంటే వారికి స్వయం ఉపాధిలో శిక్షణ ఇస్తున్నాం.