కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏ షరతుల్లేకుండా రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని అన్నదాతలను మాయ చేసి అధికారంలోకి రాగానే మొండి చెయ్యి చూపుతున్నది. నిబంధనల పేరుతో ఎన్నో కొర్రీలు పెడుతూ రుణమాఫీని ఎగ్గొట్టాలని చూస్తున్నది. అప్పుపోతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతుల నోట్లో మట్టికొడుతున్నది. మాకెందుకు కాలేదు దేవుడా.. మేమేం పాపం చేశాం.. అని రైతులు దిగులుచెందుతున్నారు. నిత్యం బ్యాంకులు, వ్యవసాయ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చాలా మంది రైతులు అర్హులైనప్పటికీ జాబితాలో పేర్లు రాకపోవడంతో ఇక రుణమాఫీ అందని ద్రాక్షేనా.. అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కొడంగల్, ఆగస్టు 23 : ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ పథకం రైతులకు అందని ద్రాక్షలా మారిందని, అర్హత ఉన్నప్పటికీ లబ్ధి పొందలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. మూడు విడుతల్లో రుణమాఫీ చేసినా ఇంకా సగానికిపైగా రైతులకు మాఫీ కాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే కొర్రీలు పెట్టి కోతలు విధిస్తున్నదని రైతులు ఆరోపిస్తున్నారు.
రైతులను గోసపెట్టిన ఏ పార్టీ మనుగడ సాధించలేదని, రాబోవు రోజుల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదని అన్నదాతలు హెచ్చరిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు ఎన్నో ఆశలు పెట్టి అధికారంలోకి రాగానే నట్టేట ముంచుతున్నాడని మండిపడుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఎలాంటి రైతులందరికీ పంట రుణాలను మాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు వేరు పడితే వేర్వేరుగా ఎవుసం చేసుకోరా.. రేషన్ కార్డు ఒక్కటే ఉంటే మాఫీ చేయరా.. ఆధార్ కార్డులోనూ చిన్నచిన్న పొరపాట్లు ఉన్నాయని సాకులు చెబుతారా.. అంటూ అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు.
అప్పు ఉంటే చాలు.. తీసుకోనివారుంటే బ్యాంకుకు వెళ్లి తెచ్చుకోండి.. అని ప్రగల్భాలు పలికిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడెందుకు ఇన్ని నిబంధనలు పెడుతున్నారో తెలుపాలని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.2 లక్షల కంటే అప్పు ఎక్కువగా ఉంటే మిగిలిన డబ్బులు చెల్లిస్తేనే మాఫీ అని కొర్రీలు పెట్టడం సరికాదని అన్నదాతలు దమ్మెత్తిపోస్తున్నారు. అన్ని అర్హతలు ఉండి.. తెచ్చుకున్న రూ.లక్షలోపు రుణాలు కూడా మాఫీ చేయకపోవడం వంటి.. కాంగ్రెస్ ప్రభుత్వ ధోరణి చూస్తుంటే అన్నదాతలను మోసం చేయాలని చూస్తున్నట్లు అర్ధమవుతున్నదని నిప్పులు చెరుగుతున్నారు.
మండల పరిధిలోని రుద్రారం యూనియన్ బ్యాంకు పరిధిలో మొత్తంగా 3500 మంది రైతులు రుణాలు తీసుకొన్నట్లు బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో మొదటి విడుతలో రూ.50వేల లోపు రుణాలున్న 757 మంది రైతులకు రూ.4కోట్ల 4లక్షలు మాఫీ కాగా, రెండో విడుతలో 598 మందికిగాను రూ.6కోట్ల 21లక్షలు, మూడో విడుతలో 354 మందికి గాను రూ.3కోట్ల 5లక్షలను ప్రభుత్వం మాఫీ చేసింది. రుద్రారం యూనియన్ పరిధిలోని రుద్రారం, అన్నారం, నాగారం, పాటుమీదిపల్లి, టేకల్‌కోడ్, బోనమ్మతండా వంటి తదితర గ్రామాల్లో కొంతమందికే లబ్ధి చేకూరిందని, ఇంకా సగానికిపైగా రైతులకు రుణమాఫీ కాలేదని మండలంలోని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కేసీఆర్ హయాంలో ఎలాంటి షరతుల్లేకుండా రూ.లక్షల్లోపు రుణాలను పూర్తి మాఫీ చేశారని, ఎలాంటి కొర్రీలు పెట్టలేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఎటువంటి ఆంక్షలు విధించకుండా రైతులందరికీ రూ.2లక్షల రుణమాఫీ చేయాలని మండలంలోని రైతులు కోరుతున్నారు.
నాకు నాలుగున్నర ఎకరాల పొలం ఉన్నది. రుద్రారం గ్రామంలోని యూనియన్ బ్యాంకులో రూ. లక్షా 45వేల అప్పు తీసుకొన్నా. రుణ మాఫీ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నా. మూడో విడుతలో నా అప్పు పోయినట్టేనని సంబురపడ్డా. జాబితాలో పేరు రాకపోయే సరికి ఆగమైతున్నం. ఏమైందోనని బ్యాంకు కాడికిపోయి అడిగితే అగ్రికల్చర్ కార్యాలయం కాడికి వెళ్లి అడుగు అని చెప్పిండ్రు. ఇగ నా పని రోజూ బ్యాంకు, వ్యవసాయ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడంతోనే సరిపోతుంది. నాతోపాటు వందల మంది తిరుగుతుండ్రు. పనిమానుకుని రోజంతా రుణమాఫీ కోసం తిరుగడం వల్ల నా వ్యవసాయం వెనుకబడుతున్నది. కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు రైతులకు ఏ ఇబ్బంది రాలె. రైతుల కష్టాలను తీర్చిండు. కాంగ్రెసోళ్ల మాయమాటలు నమ్మినం. ఇంత మోసం చేస్తరని అనుకోలె.
– శ్రీనివాస్‌రెడ్డి, రుద్రారం, కొడంగల్
అసెంబ్లీ ఎన్నికలప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి ఎలాంటి షరతులు లేకుండా రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చిండు. గద్దెనెక్కిండు ఇచ్చిన మాటను మరిచిండు. రైతులందరికీ ఎలాంటి షరతుల్లేకుండా రుణాలను మాఫీ చేయాలె. ఇంట్లో అన్నదమ్ములు ఉంటే వారు వేరుగా కాపురం పెట్టుకుని ఎవరి వ్యవసాయం వారు చేసుకుంటున్నప్పుడు ఎవరి అప్పు వారే తెచ్చుకుంటరు. ఒకే కుటుంబం అన్న సాకుతో మాఫీ చేయకుండా గోస పెడుతున్నరు. ఇదేమి పద్ధతో కాంగ్రెస్ సర్కార్ ఆలోచించుకోవాలి. రానున్న రోజుల్లో ఇక మీ మాయ మాటలను రైతులు నమ్మే స్థితిలో లేరు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటే మంచిది. లేదంటే రైతులంతా బుద్ధి చెప్పడం ఖాయం. కేసీఆర్ హయాంలో రైతులందరికీ రుణమాఫీ అయ్యింది. అదే మాదిరిగా రైతులందరికీ రుణమాఫీ చేయాలె.
– నారాయణరెడ్డి, రుద్రారం, కొడంగల్