తుర్కయంజాల్,జనవరి 7 : కోహెడ ప్రాంతాన్ని కచ్చితంగా డివిజన్‌గా(Koheda division) ప్రకటించాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. బుధవారం తొర్రూర్ డివిజన్ పరిధిలోని కోహెడ చౌరస్తాలో కొహెడ జేఏసీ ఆధ్వర్యంలో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలోని రైతుల భూ సమస్యలు, కోహెడ డివిజన్ ఏర్పాటు కోరకు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దత్తాత్రేయ మాట్లాడుతూ.. రెవెన్యూలో అతిపెద్ద గ్రామమైన కోహెడ ప్రాంతాన్ని కచ్చితంగా డివిజన్‌గా చేయడంతో పాటుగా ఎల్బీనగర్ ప్రాంతానికి దగ్గరగా ఉన్న కోహెడను శంషాబాద్ జోన్లో కాకుండా ఎల్బీనగర్ జోన్లో కలిపాలని అన్నారు.
కోహెడ రైతుల భూములను లాక్కొని ఎవరికో అప్పగించడం సరైన చర్య కాదని, భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం 500 గజాల స్థలాన్ని కేటాయించాలని కోరారు. అదే విధముగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మాస్టర్ ప్లాన్‌తో రైతులకు అన్యాయం జరుగుతందని కావున ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌ను మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల భూములను కన్జర్వేషన్ జోన్ నుంచి తొలగించి వెంటనే రెసిడెన్షియల్ జోన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
అదే విధంగా శివారు మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసిన సందర్భంలో డివిజన్ల విభజన ఆశాస్త్రీయంగా జరిగిందని, ప్రభుత్వం శాస్త్రీయంగా జనాభా ప్రాతిపదికన, విస్తీర్ణం ప్రకారం డివిజన్‌గా విభజన చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బిందు రంగారెడ్డి, విజయ్ బాబు, నాయకులు బోసుపల్లి ప్రతాప్, రాంరెడ్డి, బలదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.