సిటీబ్యూరో, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : నగరంలో గణపతి లడ్డూ వేలం అ‘ధర’హో అన్నట్లుగా సాగింది. గల్లీ నుంచి మొదలుకుంటే బడా గణేశుడి వరకు లడ్డూ దక్కించుకునేందుకు పోటాపోటీగా పాల్గొన్నారు. నవరాత్రుల కంటే చివరి రోజున జరిగే లడ్డూ వేలం నిర్వహణ ప్రత్యేక ఆకర్షణ ఉండగా.. ఏటా గణేశుడి లడ్డూలు రికార్డు ధరలు పలుకుతున్నాయి. బండ్లగూడ జాగీర్ సమీపంలో ఉండే రిచ్మండ్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీలో జరిగిన లడ్డూ వేలం ప్రక్రియలో రూ.కోటీ26లక్షలు పలికింది. గతేడాది కంటే రెండింతలు రేటుతో లడ్డూను దక్కించుకున్నారు.
ఒకప్పుడు బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం అంటేనే సర్వత్రా ఆసక్తి నెలకొని ఉండేది. ఇప్పటికీ అదే తీరుగా వేలంను నిర్వహిస్తున్నప్పటికీ.. నగరంలోని పలు గణేశ్ మండపాల వద్ద అంతకు మించిన ధరలకు లడ్డూలను కొనుగోలు చేస్తున్నారు. బాలాపూర్ లడ్డూకు గట్టి పోటీనిస్తూ సరికొత్త రికార్డులు ఏటా బండ్లగూడ జాగీర్‌లోని సన్‌సిటీ రిచ్మండ్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీలో జరుగుతున్నాయి. తాజాగా నిర్వహించిన లడ్డూ వేలంలో రూ.కోటీ26లక్షలకు లడ్డూలను దక్కించుకున్నారు. గతేడాదిలో నిర్వహించిన లడ్డూ వేలంలో రూ.65లక్షలకు అమ్ముడుపోగా.. ఈసారి రెండింతల ధర పలికింది. ఈసారి లడ్డూ వేలంలో వచ్చిన డబ్బులను సామాజిక కార్యక్రమాల్లో వినియోగించనున్నట్లు తెలిసింది.
అట్టహాసంగా లడ్డూ వేలం పాటలు
గ్రేటర్‌వ్యాప్తంగా 95వేలకు పైగా గణేశ్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. నిర్వాహకులు దశలవారీగా నిమజ్జనం నిర్వహిస్తూనే ఉన్నారు. నవరాత్రుల్లో చివరి రోజు కావడంతో లడ్డూ వేలాలు భారీగా జరిగాయి. ఈ క్రమంలో గల్లీలు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్టుమెంట్లు, కాలనీ గణేశుడి మండపాల వద్ద నిర్వాహకులు అట్టహాసంగా వేలం ప్రక్రియ చేపట్టారు.
లడ్డూను దక్కించుకున్న దాసరి దయానంద్‌రెడ్డి
బడంగ్‌పేట : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయాంజాల్ పాటిగూడ గ్రామానికి చెందిన రియల్టర్ దాసరి దయానంద్‌రెడ్డి బాలాపూర్ గణనాథుడి లడ్డూను వేలంలో రూ.27లక్షలకు దక్కించుకున్నారు. 1994లో రూ.450తో ప్రారంభమైన బాలాపూర్ గణనాథుడి లడ్డూ 2023 నాటికి రూ.27లక్షల రికార్డు స్థాయి ధర పలికింది. వేలంలో పాల్గొనడానికి వచ్చిన 36 మంది పేర్లు ఉన్న జాబితాను ఉత్సవ సమితి సభ్యుడు వంగేటి లక్ష్మారెడ్డి చదివి 10.40 గంటలకు వేలాన్ని ప్రారంభించారు. 15 నిమిషాల పాటు వేలం కొనసాగింది. వేలంలో రూ. 27లక్షలకు దాసరి దయానంద్‌రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. గత సంవత్సరం రూ.24.60 లక్షలకు బాలాపూర్‌కు చెందిన ఉత్సవ సమితి సభ్యుడు వంగేటి లక్ష్మారెడ్డి దక్కించుకోగా.. ఈసారి రూ.2.40 లక్షలు పెరిగింది.
బాలాపూర్ గణనాథుడికి పూజలు
ఉదయం 5 గంటలకు ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో గణనాథుడికి చివరి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం గణేశ్ శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్రలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గణేశ్ ఉత్సవాలను ప్రజలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.
రూ.17లక్షలు పలికిన లడ్డూ
బడంగ్‌పేటలో వీరాంజనేయ భక్త సమాజం అధ్యక్షుడు లోకం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి లడ్డూకు గురువారం వేలం నిర్వహించారు. వేలంలో 15 మంది పాల్గొన్నారు. చివరకు పెద్ద బావి వెంకట్‌రెడ్డి రూ.17లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. గత సంవత్సరం రూ.14లక్షలు పలికింది. ఈ ఏడాది మూడు లక్షలు ఎక్కువ. కార్యక్రమంలో రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, మేయర్ పారిజాత, ఉత్సవ సమితి అధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, కార్పొరేటర్లు స్వప్న, అర్జున్, రమాదేవి, ఆనంద్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ప్రభు, పోలీస్ అధికారులు, వివిధ పార్టీల నాయకులు, ఉత్సవ సమితి నాయకులు పాల్గొన్నారు.
చేవెళ్ల రచ్చబండ వినాయక లడ్డూ రూ.22,11,001
చేవెళ్లలోని రచ్చబండ వద్ద ప్రతిష్ఠించిన వినాయకుడికి లడ్డూకు రూ.22,11,001లకు గ్రామానికి చెందిన కావడి తిరుపతిరెడ్డి గ్రూపు సభ్యులు దక్కించుకున్నారు. గత సంవత్సరం రూ.12,01,001లకు పలికింది. అనంతరం అక్కడి నుంచి అటపాటలతో వినాయకుడి శోభాయాత్ర నిర్వహించి చేవెళ్లలోని వేంకటేశ్వరస్వామి పుష్కరిణిలో నిమజ్జనం చేశారు.
– చేవెళ్లటౌన్
నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో..
నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్‌లో ఆంజనేయస్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ లడ్డూకు వేలం నిర్వహించగా… 10 లక్షల 1116 రూపాయలకు డాకూరి శివరాజ్ కుటుంబ సభ్యులు దక్కించుకున్నారు.
– రాజేంద్రనగర్
నిజాంపేటలోని స్ప్రింగ్ విల్లా కాలనీలో..
నిజాంపేటలోని స్ప్రింగ్ విల్లా కాలనీలో ఏర్పాటు చేసిన గణనాథుడి వద్ద ఏర్పాటు చేసిన లడ్డూకు గురువారం వేలం నిర్వహించారు. వేలంలో కాలనీకి చెందిన దివ్యసుబ్రహ్మణ్యం రూ.10 లక్షల 116లకు దక్కించుకున్నారు. అలాగే స్వామి వారి మెడలో వేసిన కరెన్సీతో తయారు చేసిన లక్ష్మి మాలను వేలంలో కవితాసతీశ్రాజు లక్షా 50వేలకు దక్కించుకున్నారు.
మణికొండ మున్సిపాలిటీ పరిధిలో..
రాజేంద్రనగర్ నియోజకవర్గం, మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని నవజ్యోతి యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూ వేలం నిర్వహించారు. ఈ వేలంలో లడ్డూను రూ.9 లక్షలకు ముంగి మోహన్‌రెడ్డి దక్కించుకున్నారు.
– రాజేంద్రనగర్, సెప్టెంబర్ 28
భోలక్‌పూర్‌లో 5.68 లక్షలు
భోలక్‌పూర్ డివిజన్లో శ్రీ సిద్ధి వినాయక భగత్‌సింగ్ యూత్ అసోసియేషన్ ఆర్గనైజర్ జి.అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూకు వేలం నిర్వహించారు. వేలంలో గౌతమి గౌడ్ అనే యువతి లడ్డూను రూ.5.68 లక్షలకు దక్కించుకున్నారు. – కవాడిగూడ, సెస్టెంబర్ 28
అత్తాపూర్ లడ్డూ రూ.10.11లక్షలు
రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్ న్యూస్టార్ భక్త సమాజం ఆధ్వర్యంలో గణేశ్ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. గత రికార్డులను బ్రేక్ చేస్తూ గురువారం నిర్వహించిన వేలంలో రూ.10.11 లక్షలకు అత్తాపూర్‌కు చెందిన గుమ్మడి భూపాల్‌రెడ్డి దక్కించుకున్నారు. ఇది గతేడాదికంటే రూ.2లక్షలు ఎక్కువ కావడం విశేషం. 2022లో రూ.8.11 లక్షలు పలికింది. ఈసారి వేలంలో 25 మంది ఔత్సాహికులు పాల్గొనగా లడ్డూను దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. లడ్డూ వేలం తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. అత్తాపూర్ లడ్డూ వేలానికి నేటితో 27 ఏళ్లు పూర్తయింది.
-అత్తాపూర్, సెప్టెంబర్ 28