షాబాద్, మే 27: రైతులు నాణ్యమైన విత్తనాలనే కొనుగోలు చేయాలని మండల వ్యవసాయాధికారి వెంకటేశం అన్నారు. సోమవారం మండల పరిధిలోని అంతారం, బోడంపహాడ్, మల్లారెడ్డిగూడ, సంకెపల్లిగూడ, తాళ్లపల్లి గ్రామాల్లో విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నాగరగూడ, షాబాద్‌లో ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీలర్లు రైతులకు కావాల్సిన పత్తి, వరి తదితర పంటల విత్తనాలను అందుబాటులో ఉంచాలని, ఎలాంటి కొరత రాకుండా నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించాలని తెలిపారు. విత్తనాలు, ఎరువుల కృత్రిమ కొరతను సృష్టించవద్దని చెప్పారు. నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని, ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఫర్టిలైజర్ దుకాణాల్లోనే విత్తనాలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈవోలు రాజేశ్వరి, లిఖిత, సోనిశ్రీ, గీత, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
చేవెళ్ల రూరల్ : మార్కెట్లో నకిలీ విత్తనాల అమ్మకం, విత్తనాల కొనుగోలులో రైతులు జాగ్రత్తగా వ్యవహరించాలని మండల వ్యవసాయ అధికారి తులసి అన్నారు. సోమవారం మండల పరిధిలోని దామరగిద్ద, చన్వెల్లి గ్రామాల్లో నకిలీ విత్తనాలు, విత్తనాల కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి తులసి మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో మార్కెట్లలో నకిలీ విత్తనాల అమ్మకం జోరుగా సాగుతుందని, రైతులు ఇది గమనించి నాణ్యమైన విత్తనాలు విక్రయించేలా వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలతో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి బాలకృష్ణ, రెండు గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.
షాద్‌నగర్‌రూరల్ : రైతులు ప్రధానంగా లూజు సంచులల్లో ఉన్న విత్తనాలను కొనుగోలు చేయవద్దని ఫరూఖ్‌నగర్ మండల వ్యవసాయ అధికారి నిశాంత్‌కుమార్ రైతులకు సచించారు. మండలంలోని కందివనం, ఎలికట్ట, బూర్గుల, పీర్లగూడెం, వెలజర్ల, దేవునిబండా తండాల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు విత్తనాల కొనుగోలుపై అవగాహన సదస్సులను నిర్వహించారు. నకిలీ విత్తనాలను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి రోజు వివిధ గ్రామాల్లో ఈ అవగాహన సదస్సులను నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : వర్షాకాలం పంటల సాగుకోసం విత్తనాల కొనుగోలు విషయంలో రైతులు సరైన జాగ్రత్తలు పాటించాలని ఇబ్రహీంపట్నం వ్యవసాయ విస్తరణాధికారి శ్రవణ్‌కుమార్ అన్నారు. మండల పరిధిలోని నాగన్‌పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యంగా వ్యవసాయాధికారుల సూచనల మేరకు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
కడ్తాల్ : కాల పరిమితి ముగిసిన విత్తనాలను కొనుగోలు చేయవద్దని మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీలత అన్నారు. మండల పరిధిలోని మక్తమాదారం, నాగిరెడ్డిగూడ, పెద్దవేములోనితండా, ముద్విన్ గ్రామాల్లో విత్తన కొనుగోలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఏవో మాట్లాడుతూ.. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే దుకాణాల నుంచి రసీదులు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.
ఆమనగల్లు : మండల పరిధిలోని కోనాపూర్, సీతారంనగర్తండా, చంద్రాయన్పల్లి తండా, మూర్తుజపల్లి గ్రామాలల్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో, ఏఈవోలు విత్తనాల ఎంపిక, పంట మార్పిడి పద్ధతిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వ్యవసాయ శాఖ గుర్తింపు పొందిన అధీకృత డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేసి తప్పనిసరిగా రసీదు తీసుకోవాలన్నారు. అనంతరం మండల వ్యవసాయ అధికారిణి అరుణకుమారి ఆకుతోటపల్లిలో ఉన్న ఫర్టిలైజర్ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఎరువులు, రికార్డులను పరిశీలించారు. కార్యక్రమాల్లో విస్తరణ అధికారులు రాణి, సాయిరాం, శివతేజ, మీనాక్షి , రైతులు పాల్గొన్నారు.