పరిగి/పెద్దేముల్, మే 21 ; ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం..అందులో ఒక హామీగా మహిళల కోసం అమలు చేస్తున్న ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం ఆటోడ్రైవర్ల బతుకులను రోడ్డునపడేసింది. ప్రతిరోజూ ఆటో నడిపితే కానీ ముందుకు సాగని వారి జీవితాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఛిద్రం చేసింది. గత నాలుగైదు నెలల ముందు వరకు ప్రతిరోజూ కనీసం మూడు నుంచి నాలుగు ట్రిప్పుల్లో ప్రయాణికులకు వారివారి గమ్యస్థానాలకు చేర్చి రూ.వెయ్యికి పైగా వచ్చిన మొత్తంతో కుటుంబంతో ఆనందంగా జీవించిన ఆటోడ్రైవరన్నా.. కాంగ్రెస్ సర్కారు తీసుకొచ్చిన కొత్త పథకంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. రోజంతా ఆటోను నడిపితే గిరాకీ లేక డీజిల్ ఖర్చులు పోగా రూ.వంద లోపే మిగులుతున్నదని ఈ స్థితిలో ఫైనాన్స్ డబ్బులు, పిల్లలు స్కూల్ ఫీజులు, కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక మథనపడుతున్నాడు. ఇప్పటికే కొంతమంది ఆటోడ్రైవర్లు అప్పులు, కిస్తీలు, వడ్డీలు, కుటుంబాలను పోషించలేక బలవన్మరణానికి పాల్పడిన ఘటనలు ఉన్నాయని.. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆటోడ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నారు.
డీజిల్ పైసలూ రావడం లేదు
ప్రతిరోజూ పరిగి నుంచి లాల్‌పహాడ్ దారిలో ఆటో నడుపుతా. ఉచిత బస్సు పథకం రావడంతో మహిళలు ఆటోల్లో ప్రయాణించడంలేదు. గతంలో డీజిల్ ఇతర అన్ని ఖర్చులుపోగా నెలకు రూ.12 వేలకు పైగానే వచ్చేవి. ప్రస్తుతం రోజుకు ఒక ట్రిప్పే వెళ్తుండగా రూ.150 వరకు మిగులుతున్నాయి.. నాకు కుమార్తె, కుమారుడు ఉన్నాడు. ఇద్దరూ డిగ్రీ చదువుతున్నారు. వారిని చదివించాలంటే చాలా ఇబ్బందికరంగా మారిం ది. – భీమయ్య, ఆటో డ్రైవర్, సుల్తాన్పూర్, పరిగి
ఆటోలకు గిరాకీ లేదు..
కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేయడంతో ఆటోల్లో ప్రజలు ఎక్కడం లేదు. గతంలో రోజుకు డీజిల్ ఖర్చులుపోగా రూ.వెయ్యివరకు వచ్చేవి. ప్రస్తుతం ఫ్రీ బస్సు కారణంగా రూ.300 రావడం లేదు. వచ్చే నెలలో స్కూళ్లు ప్రారంభమవుతాయి. పిల్లల స్కూల్ ఫీజులు, కుటుంబ పోషణ, పుస్తకాలు తలుచుకుంటేనే భయంగా ఉన్నది. రూ.300లతో ఎలా బతకాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం ఆటోవాలాలను ఆదుకోవాలి.
-శ్రీనివాస్, ఆటో డ్రైవర్ , పెద్దేముల్
గతంలో ఆరు ట్రిప్పుల వరకు..
ఫ్రీ బస్సు పథకంతో ఆటోలకు గిరాకీలేదు. గత నాలుగైదు నెలల ముందు ఆరు ట్రిప్పుల వరకు ప్రయాణికులను గమ్యస్థానాలకు తీసుకెళ్లేది. ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితులున్నాయి. మహిళలు అస్సలు ఆటోలు ఎక్కడం లేదు. కుటుంబాన్ని పోషించలేక, ఫైనాన్స్‌లు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పిల్లల ఫీజులు, పుస్తకాలకు పైసలు ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థం కావడంలేదు. ఆటోడ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడకుండా సర్కారు చర్యలు తీసుకోవాలి.
– యశ్వంత్ ,ఆటో డ్రైవర్ , పెద్దేముల్
పిల్లల ఫీజులు కట్టలేక పోతున్నాం
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆటోల్లో ఎక్కే వారి సంఖ్య తగ్గింది. గతంలో వికారాబా ద్ నుంచి ధారూరుకు ఆటోను నడిపితే ప్రతిరోజూ రూ.1500 వరకు వచ్చేవి. ఆ వచ్చిన మొత్తంతో ప్రతి నెలా ఈఎంఐకి రూ.6000, ఇంటి అద్దె రూ.3000, పిల్లల ఫీజులు, కుటుంబ పోషణకు సరిపోయేవి. ప్రస్తు తం ఆటోల్లో మహిళలు ఎక్కకపోవడంతో రోజుకు రూ. 500 వరకే వస్తున్నాయి. వాటితో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది.
– పోచయ్య, రాజీవ్‌నగర్, వికారాబాద్
కుటుంబం గడుస్తలేదు..
ఉచిత బస్సు ప్రయాణంతో భార్యాభర్తలు ఇద్దరూ ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్తున్నారు. ఆట్లోల్లో మాత్రం ఎక్కడం లేదు. గతంలో ఆటో నడిపితే రూ.1200 వరకు వచ్చేవి. ప్రస్తుతం రూ.300 కూడా రావడం లేదు. వచ్చిన డబ్బులు డీజిల్‌కు కూడా సరిపోవడంలేదు. కుటుంబ పోషణ, పిల్లల చదువు భారంగా మారింది. రోజువారీ ఫైనాన్స్ రూ.150 చెల్లించాలి.. అంతేకాకుండా ప్రతినెలా ఈఎంఐ రూ. 7 వేలు చెల్లించేందుకు అవస్థలు పడుతున్నా.
– పాపయ్య, బాచారం, వికారాబాద్
బతుకులు భారంగా మారాయి..
గత నాలుగైదు నెలల నుంచి ఆటోడ్రైవర్ల బతుకులు దుర్భరంగా మారాయి. మహిళలు ఆటోల్లో ఎక్కడమే మానేశారు. దీంతో గిరాకీ బాగా తగ్గింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఫ్రీ కావడంతో మహిళలు ఎక్కడికైనా ఉచితంగానే వెళుతున్నారు. రోజుకు రూ.రెండు, మూడు వందలు కూడా సరిగ్గా రావడంలేదు. ప్రభుత్వం ఆటోడ్రై వర్ల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి, ఆర్థికంగా ఆదుకోవాలి.
– నరేశ్‌గౌడ్, ఆటోడ్రైవర్, తాండూరు
ఫ్రీ జర్నీ మా పొట్ట కొట్టింది..
ఫ్రీ జర్నీ మా పొట్టకొట్టింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రభుత్వం ఉచిత ప్రయాణం కల్పించడంతో వారు అందులోనే ప్రయాణిస్తున్నారు. దీంతో మాకు గిరాకీ తగ్గిపోయింది. గతంలో ఆటోలు బాగా నడిచేవి. మాకు గిట్టుబాటు అయ్యేది. ప్రస్తుతం డీజిల్ ఖర్చులు కూడా రావడంలేదు. ఆటో డ్రైవర్ల జీవితం దుర్భరంగా మారింది. పూట గడవడమే కష్టంగా ఉన్నది.
– బంగారం నర్సింహులు, ఆటో డ్రైవర్, బొంరాస్‌పేట
ప్రభుత్వం ఆదుకోవాలి
మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుతో మా ఆదాయం బాగా తగ్గింది. చిన్న ఫంక్షన్లు, వివాహాలు ఉంటే ఆటోలను మాట్లాడుకుని వెళ్లేవారు. ఇప్పుడు మహిళలు బస్సులు వచ్చే వరకు బస్టాండ్లల్లో నిరీక్షించి అందులోనే వెళ్తున్నారు. అప్పులు చేసి ఆటోలు కొన్న వారు కిస్తీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. ఆదా యం తగ్గిపోయింది. కుటుంబాలను పోషిం చడం భారంగా మారింది. ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి.
– ఎండీ మక్బూల్, ఆటో డ్రైవర్, బొంరాస్‌పేట
ఆటోల వైపే చూడడంలేదు..
ఫైనాన్స్‌లో ఆటో తీసుకున్నా. ప్రతిరోజూ మన్నెగూడ, వికారాబాద్ ప్రాంతాలకు చెందిన ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయగా డీజిల్ ఖర్చులు పోగా రూ.500 నుంచి రూ.800 వరకు మిగిలేవి. కానీ ఉచిత బస్సు పథకం వచ్చిన తర్వాత ఆటోలకు గిరాకీ పూర్తిగా తగ్గిపోయింది. మహిళలు అస్సలు ఆటోల్లో ఎక్కడమే మానేశారు. బస్టాండ్ల వద్ద బస్సులు వచ్చే వరకు నిరీక్షించి మరీ ఎక్కుతున్నారు. దీంతో రోజుకు రూ.300 వరకువస్తే డీజిల్ ఖర్చులు పోగా కొద్దిగానే మిగులుతున్నది. ఆ మొత్తంతో కుటుంబాన్ని పోషించడం, పిల్లల చదువులు, పుస్తకాలు, ఆటో కిస్తీని ఎలా కట్టాలో అర్థం కావడంలేదు. ప్రభుత్వ పెద్దలు స్పందించి ఆటోడ్రైవర్లను ఆర్థికంగా ఆదుకోవాలి.
– కె.కృష్ణాగౌడ్, చన్గోముల్ గ్రామం,పూడూరు మండలం