రంగారెడ్డి, జూలై 6 (నమస్తే తెలంగాణ) : గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూంలో నివసిస్తున్న ఓ బాధితురాలిని అధికారుల నిర్వాకంతో రోడ్డున పడేశారు. ఇంట్లోనే బట్టలు, ఇతర సరుకులు ఉండగానే.. తాళం వేయడంతో ఆమె గత రెండు నెలలుగా అనేక అవస్థలు పడుతూ.. చివరికి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి వచ్చి తనకు న్యాయం చేయాలంటూ అధికారులకు మొరపెట్టుకున్నారు. సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
రంగారెడ్డిజిల్లా శేరిలింగంపల్లి మండల పరిధిలోని కొల్లూరులో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూంల ఇండ్ల నిర్మాణం చేపట్టారు. ఈ ఇండ్లను నిరుపేదలైన వారిని గుర్తించి కేటాయించారు. ఇందులో భాగంగానే ఈ ప్రాంతంలో నివసించే భాగ్యమ్మ అనే ఓ నిరుపేద మహిళకు 14ఏ-05-10 నంబర్ గల డబుల్ బెడ్రూం ఇంటిని కేటాయించారు. అనంతరం పట్టా సర్టిఫికెట్ కూడా అందజేశారు. పట్టా సర్టిఫికెట్ తీసుకున్న బాధితురాలు భాగ్యమ్మ ఆ ఇంట్లో తన పిల్లలతో సహా వెళ్లి నివాసముంటున్నారు. తనకు ఇల్లు దొరికిందన్న సంతోషం ఎంతో కాలం నిలువలేదు. భాగ్యమ్మ గతంలో సంజీవ అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉండేది.
అధికారుల సర్వేలో పూర్తిగా ఇల్లు లేక అద్దె ఇంట్లో ఉంటున్న భాగ్యమ్మను లబ్ధిదారుగా ఎంపిక చేశారు. కాని, గతంలో అద్దెకుంటున్న ఇంటి యాజమాని సంజీవ, అలాగే, తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే సందీప్ కలిసి బాధితురాలు నివాసముంటున్న డబుల్ బెడ్రూం ఇంటికి తాళం వేశారు. తన ఇంట్లో నివాసముండటంవల్లే ఇల్లు వచ్చిందని, తనకు మూడు లక్షలిస్తేనే ఇంటి తాళం తీస్తామని సంజీవ, ఆయనకు తోడుగా సందీప్ డిమాండ్ చేశారు. అంత డబ్బు ఇచ్చుకోలేనని బాధితురాలు భాగ్యమ్మ చెప్పడంతో.. ఏకంగా ఆమె ఇంటికే తాళం వేశారు. తాను బయటకు వెళ్లగా.. తమ ఇద్దరు పిల్లలను బయటకు గెంటేసి ఇంటికి తాళం వేశారని, తన కట్టుబట్టలు, ఇతర సరుకులు, వంటపాత్రలు కూడా ఇవ్వడం లేదని ఆమె వాపోయారు.
నిరుపేద కుటుంబానికి చెందినవారమని.. తన పరిస్థితిని అర్థం చేసుకుని ఇంటి తాళం తీయాలని ఎంత వేడుకున్నా కనికరించడం లేదని ఆవేదన చెందారు. తన నలుగురు పిల్లలతోపాటు మానసిక పరిస్థితి సరిగ్గాలేని తన తమ్ముడు అందరం ఇదే ఇంట్లో నివసిస్తున్నామని పేర్కొన్నారు. తన ఇంట్లో అద్దెకు ఉండటంవల్లే డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చిందని, అది తనకే వర్తిస్తుందని గత ఇంటి యజమాని తనను తరచుగా వేధించి మూడు లక్షలివ్వాలని డిమాండ్ చేశాడని, తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే వ్యక్తిని తీసుకువచ్చి ఇంటికి తాళం వేయించాడని ఆమె వాపోయారు. తాను, తన నలుగురు పిల్లలు, తన తమ్ముడు ఎక్కడ నివసించాలో తెలియక అనేక ఇబ్బందులకు గురవుతున్నామని కలెక్టర్ కార్యాలయంలో కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే అధికారులు జోక్యం చేసుకుని తన ఇంటిని తనకు ఇప్పించాలని ఆమె కోరారు.