ఇబ్రహీంపట్నం/అబ్దుల్లాపూర్‌మెట్, జూలై 11 : విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలను నిజం చేయాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. మండల కేంద్రంలోని సర్కారు దవాఖానలో అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.
విద్యార్థులకు ప్రతిరోజూ వడ్డిస్తున్న భోజనంపై ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. భవి ష్యత్తులో ఏయే రంగాల్లో రాణించాలనుకుంటున్నారని ఒక్కొక్కరిని అడిగి తెలుసు కున్నారు. చిన్నతనం నుంచే క్రమశిక్షణతో మెలిగి తల్లిదండ్రులు, గురువులను గౌ రవించాలన్నారు. భవిష్యత్తుకు మొదటి పునాదే పదోతరగతి అని విద్యార్థులు బాగా కష్టపడి చదవాలన్నారు. అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలించి ప్రధానోపా ధ్యాయుడు సురేశ్, ఉపాధ్యాయులను అభినందించారు. స్కూల్ ఆవరణలో మొక్కలు నాటి సంరక్షించడాన్ని కలెక్టర్ మెచ్చుకున్నారు.
రోగులకు సరైన వసతులు కల్పిస్తాం..
ఇబ్రహీంపట్నం ప్రభుత్వ దవాఖానను కూడా కలెక్టర్ గురువారం తనిఖీ చేశారు. ఆస్పత్రిలో కావాల్సిన పరికరాలు, రోగులకు మౌలిక వసతులకు సంబంధించిన వివరాల నివేదికను రూపొందించి పంపాలని ఆదేశించారు. దవాఖానలో అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్ర మంలో డీఈవో సుశీందర్‌రావు, ఇబ్రహీంపట్నం ఎంఈవో వెంకట్‌రెడ్డి, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.
‘లైఫ్ సేవ్ కిట్’ పరిశీలన
బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో గీత కార్మికులకు అందజేయనున్న ‘లైఫ్ సేవ్ కిట్’ ట్రయల్ రన్‌ను అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడలో నిర్వహించారు. గీత కార్మికుడు ‘లైఫ్ సేవ్ కిట్’ ధరించి చెట్టు ఎక్కడాన్ని ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ శశాంక పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ, ఆర్డీవో అనంతరెడ్డి, టాడీ ట్యాపర్ కార్పొరేషన్ ఎండీ ఉదయ్‌ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.