పెద్దఅంబర్‌పేట, మే 16 : పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలో అవిశ్వాసంపై మళ్లీ చర్చ మొదలైంది. ‘హామీ ఇస్తున్నా.. త్వరలోనే మార్పు తథ్యం’ అని నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఇచ్చిన హామీతో మరోసారి రాజకీయం వేడెక్కింది. ప్రస్తుత మున్సిపల్ చైర్పర్సన్ చెవుల స్వప్నను స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పించి.. పెద్దఅంబర్‌పేటకు చెందిన కౌన్సిలర్‌కు ఆ బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్‌కు చెందిన మెజారిటీ కౌన్సిలర్లు నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకు బీఆర్ఎస్ కౌన్సిలర్లూ మద్దతు ఇచ్చారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల వేళ జరిగిన సమీక్షా సమావేశాల్లో పలువురు కౌన్సిలర్లు అవిశ్వాస అంశంపై ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో చర్చించగా.. ఎన్నిక లైన మూడు, నాలుగు రోజుల్లో దానిపై ముందుకెళ్దామని ఆయన హామీ ఇచ్చినట్లు సమాచారం. అవిశ్వాసం ఎప్పుడా అని నాలుగేండ్లుగా ఎదురుచూస్తున్న కౌన్సిలర్లు ‘ఆ టైం వచ్చేసింది..ఇక రేపో.. మాపో ’ అని చర్చించుకుంటున్నారు.
మున్సిపాలిటీలో 24 వార్డులున్నాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 13 సీట్లు, బీఆర్ఎస్ 8, సీపీఐ, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థి ఒక్కో సీటులో గెలుపొందారు. కానీ, కాంగ్రెస్‌లోని 13 మంది కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోయారు. ఫలితంగా కాంగ్రెస్‌లోని ఓ వర్గం మద్దతు, ఇద్దరు ఎమ్మెల్సీ ఓట్లతో బీఆర్ఎస్ కౌన్సిలర్ చెవుల స్వప్న చైర్పర్సన్ పదవిని కైవసం చేసుకున్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ల మద్దతుతో కాంగ్రెస్ కౌన్సిలర్ సంపూర్ణారెడ్డి వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. పాలకవర్గం ఏర్పడిన నాటి నుంచే కాంగ్రెస్‌లోని రెండు వర్గాలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్నాయి. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లపై అవిశ్వాసం కోసం గతేడాది జనవరిలోనే ఓ వర్గం కౌన్సిలర్లు గట్టిగా ప్రయత్నాలు చేశారు. క్యాంపులకు సైతం వెళ్లారు. చైర్పర్సన్ పదవి కోసం జయశ్రీ, వైస్ చైర్పర్సన్ పదవి కోసం కౌన్సిలర్ మురళీధర్‌రెడ్డి పోటీపడ్డారు. మరోవైపు, ఉన్న పదవులు చేజారిపోకుండా వైస్ చైర్పర్సన్ సంపూర్ణారెడ్డి వర్గం సైతం క్యాంపులకు వెళ్లింది. కొత్త పురపాలక చట్టం ప్రకారం.. నాలుగేండ్ల వరకు అవిశ్వాసానికి అవకాశం లేకపోవడంతో ఆ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చైర్పర్సన్ స్వప్నతోపాటు మరో బీఆర్ఎస్ కౌన్సిలర్ కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. దీంతో కాంగ్రెస్ బలం 15కు చేరింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరో ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు హస్తం పార్టీలో చేరడంతో కాంగ్రెస్ కౌన్సిలర్ల సంఖ్య 17కు పెరిగింది. చైర్పర్సన్ కాంగ్రెస్‌లో చేరినా ఆ పార్టీలోని ఓ వర్గం కౌన్సిలర్లు మాత్రం ఆమెపై అవిశ్వాసం పెట్టాల్సిందేనని ఎమ్మెల్యేకు స్పష్టం చేశారు. ఆ వెంటనే ఎంపీ ఎన్నికల కోడ్ రావడంతో ఎలక్షన్స్ ముందు అవిశ్వాస తీర్మానం పార్టీకి మంచిది కాదనే ఉద్దేశంతో వాయిదా వేసినట్లు తెలుస్తున్నది.
మున్సిపాలిటీలో రాజకీయాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. గతేడాది చైర్‌పర్సన్‌తోపాటు వైస్ చైర్‌పర్సన్‌పైనా అవిశ్వాసం పెట్టాలని కోరుతూ కలెక్టర్‌ను కలిశా రు. వివిధ కారణాలతో అది ముందుకు సాగలేదు. ప్రస్తుతం చైర్పర్సన్పైనే అవిశ్వా సం పెట్టాలని మెజారిటీ కౌన్సిలర్లు పట్టుబడుతున్నారు. అవిశ్వాస ప్రక్రియ లేకుండా నేరుగా స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ విషయాన్ని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ద్వారా చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లిన ట్లు తెలుస్తున్నది. పెద్దఅంబర్‌పేట కౌన్సిలర్ జయశ్రీకి చైర్పర్సన్ పదవీ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయంపై వారం వ్యవధిలో పలువురు కౌన్సిలర్లు పలుమార్లు సమావేశమై చర్చించినట్లు తెలుస్తున్నది. ఒకవేళ చెవుల స్వప్న స్వచ్ఛందంగా తప్పుకోని పక్షంలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని భావిస్తున్నా రు. అయితే, గతేడాది చైర్పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు తమ వర్గం కౌన్సిలర్ల మద్దతుతో కూడిన పత్రాలను అధికారులకు ఇచ్చిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం కోసం గతంలో ఇచ్చిన నోటీసులు పనికొస్తాయని, మరోసారి జిల్లా అధికారులను కలిస్తే ఆ ప్రక్రియ పూర్తవుతుందని పలువురు కౌన్సిలర్లు పేర్కొంటున్నారు. మరోవైపు, అవిశ్వాసంపై ఎలాంటి సమాచారం లేదని, తప్పుకోవాలని తమను ఎవరూ సంప్రదించలేదని, అవన్నీ కొందరు చేస్తున్న దుష్ప్రచారమేనని చైర్పర్సన్ స్వప్న స్పష్టంచేశారు.