రంగారెడ్డి : జిల్లాలో దారుణం జరిగింది. ఓ మైనర్ గిరిజన బాలిక (Tribal girl) పై భూయజమాని అత్యాచారానికి (Atrocity) ఒడిగట్టాడు. బాలిక గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన జిల్లాలోని శంషాబాద్ మండలం ఎర్రకుంట తండాలో చోటు చేసుకుంది.
తండ్రితో కలిసి పనికి వెళ్లిన గిరిజన బాలికపై భూయజమాని కృష్ణారెడ్డి(30) బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడికి భయపడి ఆమె నోరు విప్పలేదు. దీన్ని అవకాశంగా తీసుకుని పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడగా ఆమె గర్భం దాల్చింది. దీంతో బాలికను కొత్తూరు గ్రామానికి తీసుకెళ్లి అబార్షన్ చేయించాడు.
ఈ విషయం బయటకు పొక్కకుండా మంగళవారం తన వ్యవసాయ క్షేత్రంలో తండా, గ్రామపెద్దలను కూర్చోబెట్టి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. ఎలాగో తప్పు జరిగిందని, ఎంతో కొంత డబ్బు ఇచ్చి రాజీ చేసుకుంటానని చెప్పుకొచ్చాడు. దీంతో బాలిక, కుటుంబ సభ్యులు డబ్బులకు లొంగక శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు నిందితుడు కృష్ణారెడ్డితో పాటు డాక్టర్ రంజిత్, మరో ఇద్దరిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైద్యుడు రంజిత్ పరారీలో ఉన్నట్టు సమాచారం. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.