న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ : కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సీఐటీయూ, సీపీఐల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల కార్యాలయాలు, ఇండ్లు, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ఆశ వర్కర్లు ధర్నాలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఆశ వర్కర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్కలు వేతనాన్ని పెంచుతామని హామీ ఇచ్చి.. ప్రస్తుతం ముఖం చాటేస్తున్నారని మండిపడ్డారు. ఫిబ్రవరి నెలలో జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేలా తీర్మానాలు చేయాలని, కనీస వేతనం రూ. 18వేలుగా నిర్ణయించాలని కోరారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కార్యాలయం గేటుకు వినతి పత్రం సమర్పించారు. కొడంగల్‌లోని కడా కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆశ వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు విధుల్లో ఉంటున్నామని, ఆదివారం సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
పరిగిలోని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఇంటి ఎదుట ఆశ వర్కర్లు ధర్నా నిర్వహించారు. తమ డిమాండ్లు నెరవేరేవరకు ఉద్యమిస్తామన్నారు. వికారాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆశ వర్కర్లు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా పట్టించుకోవడం లేదని ఆ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.