ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం శుక్రవారం నుంచి షురూ కానున్నది. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల ఈనెల 10 వరకు కొనసాగనుండగా.. అభ్యర్థులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని, వాహనాలను అంతకుమించి లోపలికి తీసుకురాకూడదని పేర్కొన్నారు. దరఖాస్తు సమయంలో ఐదుగురికి మాత్రమే లోనికి ప్రవేశముంటుందని, సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. మరోవైపు ఆయా పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ముహూర్తాలను చూసుకుంటున్నారు.
-రంగారెడ్డి, నవంబర్ 2(నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : శాసనసభ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్నది. రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, షాద్‌నగర్, కల్వకుర్తి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఎల్బీనగర్ నియోజకవర్గాలు ఉండగా ఎక్కడికక్కడ నామినేషన్లను స్వీకరించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు జిల్లాలో నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ భారతి హోలీకేరీ తెలిపారు.
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలకు అధికార యంత్రాంగం చకచకా ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల గుర్తింపు, పోలింగ్ అధికారులకు శిక్షణ వంటి ప్రక్రియలను చేపట్టారు. శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్ గత నెలలోనే వెలువడగా.. ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్వో కార్యాలయంలో అకౌంటింగ్ టీం, వీవీటీ టీం, సీ విజల్, హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు.
సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ సీసీ కెమెరాల్లో నిక్షిప్తం కానుంది. నామినేషన్ల వివరాలను ఎప్పటికప్పుడు ఎన్కోర్ అనే ఎన్నికల సంఘం వెబ్సైట్లో అప్లోడ్ చేసేలా ఏర్పాటు చేశారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రానికి 100మీ. వరకు ఆంక్షలు విధించారు. వాహనాలేవీ 100మీ. దాటి లోపలకు రావడం కుదరదు. దరఖాస్తు సమయంలో ఐదుగురికి మాత్రమే అవకాశాన్ని కల్పించారు. అంటే.. అభ్యర్థితోపాటు మరో నలుగురికి మాత్రమే వెళ్లొచ్చు.
ఎన్నికల షెడ్యూల్‌కు ముందే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. బీ-ఫామ్‌లను కూడా అందజేశారు. ప్రచారంలోనూ దూసుకెళ్తున్నారు. అదే ఊపుతో నామినేషన్లను సమర్పించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మంచి రోజు, మంచి ముహూర్తంలో నామినేషన్లు వేసేందుకు సమాయత్తమవుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు మాత్రం అన్నింట్లోనూ వెనుకంజలోనే ఉన్నాయి.
అభ్యర్థులను ప్రకటించడంలోనూ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు జాప్యం చేశాయి. దీంతో ఇప్పటివరకు కూడా ఆయా అభ్యర్థులు ప్రచారంలోకి వెళ్లలేదు. ఇక కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థులకు బీ-ఫామ్లనూ ఇవ్వలేదు. గతంలో నామినేషన్ల చివరి రోజు కూడా అభ్యర్థులను మార్చిన పరిస్థితులు ఉండడంతో ఇప్పటికీ ఈ రెండు పార్టీల అభ్యర్థులకు నామినేషన్లు వేసే విషయంలో సంశయం వెంటాడుతున్నది. ఈనెల 8తర్వాత మంచి ముహూర్తాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుండడంతో చివరి రోజుల్లోనే పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇబ్రహీంపట్నం : రంగారెడ్డిజిల్లాలో సాధారణ ఎన్నికల కోసం నేటినుంచి ప్రారంభమయ్యే నామినేషన్ల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రంగారెడ్డి కలెక్టర్ భారతి హోలీకేరీ అన్నారు. గురువారం ఆమె ఇబ్రహీంపట్నం రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల నామినేషన్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకోవాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
జిల్లాలోని అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద వందమీటర్ల లోపు 144 సెక్షన్ అమలులో ఉంటుందని కలెక్టర్ తెలిపారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున నిబంధనలకు లోబడి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవాలన్నారు. నామినేషన్లు వేయటానికి వచ్చే అభ్యర్థులు తమ వెంట వచ్చే నలుగురికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఈ నెల 10న నామినేషన్ల చివరితేదీ అని 13న స్కూట్నీలుంటాయన్నారు. 15న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని ఆమె అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు ఆర్డీవో అనంత్‌రెడ్డి, తహసీల్దార్లు అన్వర్, శ్రీకాంత్‌రెడ్డి ఉన్నారు.
ఈ నెల 3 నుంచి 5వ తేదీ ఆదివారం మినహా 10వ తేదీ వరకు ఆయా రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. అభ్యర్థులు ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు తమ నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. అభ్యర్థితో పాటు మరో నలుగురికి మాత్రమే నామినేషన్లు వేసుకునేందుకు అనుమతి ఇస్తారు. గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులకు ఒక్కరు ప్రతిపాదన చేయాలని, ఇండిపెండెంట్, రిజిస్టర్ పార్టీల అభ్యర్థులకు పదిమంది ప్రతిపాదన చేయాలి.
సాధారణ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు జనరల్ స్థానాల వారికి రూ.10వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.5వేలు డిపాజిట్ చేయాలి. అభ్యర్థుల ఖర్చు రూ.40లక్షలకు లోబడి ఉండాలి. ఒక్కో అభ్యర్థి నాలుగు సెట్ల వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు ఏ, బీ ఫారాలను కూడా తప్పనిసరిగా అందజేయాలి. ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన, 15న ఉపసంహరణ, 30న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు.