వికారాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): ధరణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించేలా వికారాబాద్ జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయాల్లో నిత్యం ‘ధరణి హెల్ప్‌డెస్క్’లు, ప్రతి సోమవారం ‘ధరణి ప్రజావాణి’ నిర్వహిస్తూ రైతుల నుంచి అర్జీలను స్వీకరించి పరిష్కరిస్తున్నారు. రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోకుండా భూమికి సంబంధించిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చొరవ చూపుతున్నారు. భూమి పట్టాదారు కబ్జాలో ఉండి, ఎలాంటి కోర్టు కేసులు లేకుండా, ఈసీ క్లియర్‌గా ఉన్న దరఖాస్తులను ఎట్టిపరిస్థితుల్లోనూ పెండింగ్‌లో ఉంచకూడదని కలెక్టర్ ఆదేశించిన నేపథ్యంలో అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లావ్యాప్తంగా వారం రోజులుగా స్పెషల్ డ్రైవ్ చేపడుతుండగా.. నెలరోజుల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నింటినీ పరిష్కరించడమే లక్ష్యంగా అధికారులు ముందుకెళ్తున్నారు. ప్రతిరోజూ ఒక్కో మండలం నుంచి 20 దరఖాస్తులకు సంబంధించి రిపోర్ట్‌లను పంపించాలని తహసీల్దార్లకు కలెక్టర్ టార్గెట్‌ను నిర్దేశించారు. ఈ లెక్కన జిల్లాలో 20 మండలాలకు గాను రోజుకు 400 దరఖాస్తుల రిపోర్టులు కలెక్టర్‌కు చేరుతుండగా.. ఆయన అదనపు కలెక్టర్‌తో కలిసి పరిశీలిస్తున్నారు. హెల్ప్ డెస్క్‌లను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ప్రతి సోమవారం ప్రజావాణిని ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహిస్తున్నారు. కాగా, జిల్లాలో సుమారుగా 6 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
జిల్లాలోని రైతులెవరూ భూ సమస్యలతో ఇబ్బందులు పడకుండా కలెక్టర్ నారాయణరెడ్డి చర్యలు చేపట్టారు. ధరణి దరఖాస్తులకు సత్వరమే పరిష్కారం చూపుతున్నారు. రైతులను తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిప్పించుకోకుండా వెంటనే ధరణి దరఖాస్తులను పరిష్కరించేలా చర్యలు చేపట్టారు. కోర్టు కేసులో లేకుండా, పట్టాదారు కబ్జాలో ఉండి, ఈసీ క్లియర్‌గా ఉన్నట్లయితే సంబంధిత దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్‌లో పెట్టకుండా పరిష్కరించేలా జిల్లా ఉన్నతాధికారి ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలతో అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో ధరణి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి భూ సమస్యలతో వస్తున్న రైతుల నుంచి గత వారం రోజులుగా సమస్యలు తెలుసుకొని దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రతి సోమవారం అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లోనే ధరణి ప్రజావాణి పేరిట స్వయంగా తహసీల్దార్లే ధరణి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. కోర్టు కేసులో ఉన్న భూములు, పట్టాదారు కబ్జాలో లేకపోవడం, ఈసీ క్లియర్‌గా లేని దరఖాస్తులు మినహా మిగతా దరఖాస్తులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఎప్పటికప్పుడు పరిష్కారం చూపే దిశగా జిల్లా రెవెన్యూ యంత్రాంగం వేగంగా కసరత్తు చేస్తున్నది.
పెండింగ్‌లో 6 వేల దరఖాస్తులు
జిల్లాలో ధరణి దరఖాస్తులను నెలరోజుల్లోగా పరిష్కరించేలా జిల్లా రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందుకుగాను తహసీల్దార్లలందరికీ టార్గెట్లను నిర్దేశించారు. ప్రతిరోజూ ప్రతి మండలానికి 20 చొప్పున 20 మండలాల నుంచి 400 దరఖాస్తులకు సంబంధించి రిపోర్ట్‌లను అందజేయాలని జిల్లా ఉన్నతాధికారి ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో గత వారం రోజుల నుంచి ప్రతి మండలం నుంచి 20 దరఖాస్తులకు సంబంధించి రిపోర్ట్‌లను అందజేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో ధరణి హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సిబ్బంది దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
ధరణి దరఖాస్తుల పరిష్కారం నిమిత్తం ప్రతి సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తహసీల్దార్ కార్యాలయాల్లో ధరణి ప్రజావాణి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు.
మీ సేవా కేంద్రాల నిర్వాహకులు రైతుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసే వీలు లేకుండా జిల్లా రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఆయా మండలాల్లోని మీ సేవా కేంద్రాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని, మీ సేవా కేంద్రాల్లోనూ ధరణి హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో జిల్లా అంతటా మీ సేవా కేంద్రాల్లో ధరణి హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 6 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. రోజుకు 400 దరఖాస్తుల చొప్పున నెలరోజుల్లోగా పరిష్కరించేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు ఆయా మండలాల నుంచి పంపించే ధరణి దరఖాస్తులను అదనపు కలెక్టర్‌తో కలిసి వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి పరిష్కరిస్తున్నారు.
ప్రతి సోమవారం తహసీల్దార్కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించాలి
– కలెక్టర్ నారాయణరెడ్డి
ప్రతి సోమవారం తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి, దరఖాస్తులను స్వీకరించాలి. కోర్టు కేసులో లేని, క్లియర్ టైటిల్, కబ్జాలో ఉండి ఎలాంటి వివాదాలు లేకుండా ఉన్న ధరణి దరఖాస్తులను తప్పకుండా పరిష్కరించాలి. సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది. తహసీల్దార్లు రిపోర్ట్‌లను ఎప్పటికప్పుడు తీసుకువచ్చి ధరణి దరఖాస్తులను పరిష్కరించుకోవాలి.