రంగారెడ్డి, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఫార్మాకోసం సేకరించిన భూములపై కోర్టు స్టే ఉన్నా.. దానిని ధిక్కరించి అధికారులు కంచె వేసే పనులను ముమ్మ రం చేశారు. కోర్టు స్టే ఉన్న భూముల్లో సర్వే చేసి కంచెను ఏర్పాటు చేయొద్దని రైతులు, పలు పార్టీల నాయకులు అడ్డుకుంటే పోలీసులు వారిని ఠాణాలను తరలిం చి ఆ పనులను పోలీసు పహారా మధ్య చేపడుతున్నారు. ఇప్పటికే మేడిపల్లిలో నాలుగు బృందాలతో ఓ వైపు సర్వే, మరో వైపు కంచె పనులను చేపడుతుండగా..
నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లోనూ కంచె వేసే పనులను చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో బాధిత గ్రామాల రైతులు సోమవారం మేడిపల్లిలో సమావేశమయ్యా రు. ఇందులో అధికారులు కోర్టు స్టేనూ ధిక్కరించి ఫార్మా భూముల్లో కంచె వేయటాన్ని వెంటనే నిలిపేయాలని.. లేని పక్షంలో న్యాయ పోరాటం చేయాలని తీర్మానించారు. బాధిత రైతులకు ఇండ్ల స్థలాలు, పరిహారం, పునరావాసం, ఇంటికో ఉద్యోగం వంటివి ఇవ్వకుండానే పొలాల్లో కంచె వేస్తుండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒక్క తాటిపైకి బాధిత రైతులు..
ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో బాధిత రైతులు ఒక్కతాటిపైకి వచ్చారు. అధికారులు తమ భూముల్లో చేపడుతున్న పనులను నిలిపేయకపోతే న్యాయపోరాటం చేయాలని యోచిస్తున్నారు. యా చారం మండలంలోని మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో 979 మంది రైతులు, కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేట, బేగరికంచె, పంజాగూడ, అన్నోజిగూడ, ముచ్చర్ల, సార్లరావులపల్లి, సాయిరెడ్డిగూడ గ్రామాలకు చెందిన 868 మంది ఫార్మాలో భూములు కోల్పోయిన వారున్నారు.
వీరందరికీ మీర్ఖాన్పేట సమీపంలో ప్రత్యేక వెంచర్ ఏర్పాటు చేసి అందులో ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చి గత ప్రభుత్వం సర్టిఫికెట్లు కూడా ఇచ్చింది. కానీ, ప్రస్తుత ప్రభుత్వం కొంగరకలాన్ నుంచి ఆకుతోటపల్లి వరకు ఏర్పాటు చేస్తున్న గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కొంతభాగం ప్లాట్ల నుంచి వెళ్తుండడంతో రైతులకు ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ ఆగిపోయింది. గత సంక్రాంతి నాటికే రైతులకు ఇండ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని కలెక్టర్ హామీ ఇవ్వగా ఫ్యూచర్‌సిటీ రోడ్డు నిర్మాణం పట్టాల పంపిణీకి అడ్డంకిగా మారింది.
కంచె ఏర్పాటు చట్టవ్యతిరేకం.. ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ
ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొద్దని ఇప్పటికే కోర్టు స్టే విధించినా.. ప్రభుత్వం మొండిగా ఆ భూముల్లో కంచెను ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ అభిప్రాయపడింది. ఈ మేరకు సోమవారం పలువురు ఫార్మా బాధిత గ్రామాల రైతు లు మేడిపల్లిలో సమావేశమయ్యారు.
ఫార్మాసిటీ భూముల్లో కంచె ఏర్పాటు కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని.. ఇప్పటికే కలెక్టర్, మహేశ్వరం డీసీపీ, కందుకూరు, ఇబ్రహీంపట్నం ఆర్డీవోలు, ఇబ్రహీంపట్నం ఏసీపీ, ఫార్మా ఠాణా సీఐ, యాచారం తహసీల్దార్లకు కోర్టు స్టేలను జతచేసి ఇచ్చామని.. వాటికి స్పందించకపోతే న్యాయ పోరాటం ద్వారా అడ్డుకుంటామన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం అన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు.
రైతులకు న్యాయం జరిగే వరకు కంచె ఏర్పాటు పనులను నిలిపేసేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నామని వారు పేర్కొన్నా రు. కార్యక్రమంలో ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ నాయకురాలు కావుల సరస్వతి, నారాయణ, రాజశేఖర్‌రెడ్డి, మహిపాల్, నిరంజన్, భగవంత్‌రెడ్డి, నాగరాజు, వినోద్‌రెడ్డి, శ్రీకాంత్, శంకర్, అచ్చిరెడ్డి, కొండల్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న భూముల ఫెన్సింగ్ పనులు
యాచారం : మండలంలోని మేడిపల్లి గ్రామంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూ ముల్లో ఫెన్సింగ్ పనులు సోమవారం సైతం పోలీసుల భారీ బందోబస్తుతో కొనసాగాయి. గ్రామంలో మూడోరోజు ఆర్ఐలు మురళీకృష్ణ, రామకృష్ణ, టీజీఐఐసీ అధికారులు తమ సిబ్బందితో కలిసి భూముల చుట్టూ ఫెన్సింగ్ వేసేందుకు హద్దులు గుర్తించి, వెంటనే ఐరన్ ఫిల్లర్లు నాటించారు. రైతులు ఆటంకం కలిగించకుండా ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ కృష్ణంరాజులు తమ సిబ్బందితో భారీ బందోబస్తు కల్పించారు. ఫార్మాసిటీ ఏర్పాటు కోసం గతంలో పరిహారం తీసుకున్న రైతుల భూములకు ముమ్మరంగా ఫెన్సింగ్ వేసే ప్రక్రియ కొనసాగుతున్నది.