ఇబ్రహీంపట్నంరూరల్, జూన్ 23 : గొర్రెలను సంరక్షించుకోవడం కోసం, గొర్రెకాపరుల్లో సరైన అవగాహన లేక మందలు వృద్ధి చెందడం లేదు. ముఖ్యంగా గొర్రెల పోషణ సరిగ్గాలేక సీజనల్లో వచ్చే వ్యాధులపై సరైన జాగ్రత్తలు పాటించకపోవడంతో గొర్రెలు మృత్యువాతకు గురవుతున్నాయి. గొర్రెకాపరులు సరైన జాగ్రత్తలు పాటించాలని, పశుసంర్ధకశాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు అందజేస్తున్న వ్యాధి నివారణ మందులతో పాటు పలు రకాలకు సంబంధించిన వ్యాధులను అరికట్టేందుకు వేస్తున్న నివారణ మందులను సద్వినియోగం చేసుకోవాలని పశు వైద్యాధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలం ఆరంభంలో సీజనల్‌గా వచ్చే వ్యాధులు, వాటి నివారణ చర్యలపై తప్పనిసరిగా పెంపకందారులు అవగాహన కలిగి ఉండాలి. పౌష్టికాహారమైన మేతపైనే జీవాల ఆరోగ్యం, ఉత్పాదక సామర్థ్యం ఆధారపడి ఉంటుందన్నారు. గొర్రెలు శుభ్రమైన నీరు తాగేలా చూసుకోవాలి.
గొర్రెల ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ తీసుకోవాలని పశు సంవర్ధకశాఖ అధికారులు సూచిస్తున్నారు. గొర్రెలకు ప్రభుత్వ పరంగా నట్టల నివారణ మందులు పంపిణీ చేయడంతో పాటు నాలుగు రోజులకు పీపీఆర్ టీకాలు వేస్తున్నప్పటికీ ఇతర అంటువ్యాధులు ప్రబలి చనిపోయే అవకాశాలున్నాయి. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున గిట్టల మధ్య పుండ్లు ఏర్పడి కుంటుతుంటాయి. ఈగలు, దోమల బెడదవల్ల మూతిపుండ్లు, బ్లూటింగ్ వ్యాధులు సోకుతాయి. నోటి భాగమంతా వాచి మేత తినకుండా జీవాలు నీరసపడి మరణిస్తాయి. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పశుసంవదర్ధకశాఖ అధికారులు సూచనలిచ్చారు.
గొర్రెల పెంపకందారులు, పశుసంవర్ధకశాఖ అధికారులు అందించే సలహాలు సూచనలు పాటించి మందలను వృద్ధి చేసుకోవాలి. ఏయే సీజన్లో ఏ వ్యాధులు సోకుతాయో వాటికంటే ముందు జాగ్రత్తగా టీకాలు వేయించాలి. పశువైద్యాధికారుల సలహాలు పాటిస్తే గొర్రెలను సంరక్షించుకోవచ్చు.
– సురేశ్‌బాబు, పశువైద్యాధికారి