సిటీ బ్యూరో, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ హరిచందన దాసరి నేరుగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజావాణిలో మొత్తం 238 దరఖాస్తులు అందాయని అందులో గృహనిర్మాణ శాఖ 178, రెవెన్యూ 46, ఇతర శాఖల నుంచి 14 దరఖాస్తులు అందాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి, హౌసింగ్ పీడీ అశోక్ చక్రవర్తి, రెవెన్యూ డివిజనల్ అధికారి రామకృష్ణ, డీఎంహెచ్వో డాక్టర్ వెంకటి, స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ జ్యోతి, జిల్లా సంక్షేమాధికారులు కోటాజీ, ఆశన్న, ప్రవీణ్, ఇలియాస్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
ట్రైకమిషనరేట్ల పరిధిలో వెల్లువలా ఫిర్యాదులు
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు, విన్నపాలను సత్వరమే పరిష్కరించాలని ట్రై కార్పొరేషన్ల కమిషనర్లు ఆర్వీ కర్ణన్, వినయ్ కృష్ణారెడ్డి, సృజన అధికారులను ఆదేశించారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణిలో వచ్చిన 28 ఫిర్యాదులను కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్వీకరించారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 15 ఫిర్యాదులను కమిషనర్ వినయ్ క్రిష్ణారెడ్డి స్వీకరించారు. అలాగే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 41 దరఖాస్తులను కమిషనర్ సృజన స్వీకరించారు.