హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇండియన్ రేసింగ్ ఫెస్టివెల్(ఐఆర్ఎఫ్) నాల్గవ రౌండ్ స్ట్రీట్ రేసులో ఆతిథ్య టీమ్ గోవా ఏసెస్ టీమ్ అదరగొట్టింది. స్థానిక అభిమానుల కేరింతల మధ్య రేసు ఆద్యంతం హోరాహోరీగా సాగింది. గోవా ఏసెస్ డ్రైవర్లు రౌల్ హైమన్, ఫాబియన్ వోల్వెండ్ నిర్ణీత లక్ష్యాన్ని 42:11:779 సెకన్లలో పూర్తి చేసి పోడియం ఫినిష్ చేశారు.
తొలి దశలో రౌల్ హైమన్ మెరుపు వేగంతో కారును నడిపించగా, రెండో దశలో ఫాబియన్ వోల్వెండ్ అదే జోరు కొనసాగిస్తూ జట్టును అగ్రస్థానంలో నిలిపింది. చాంపియన్‌షిప్ చరిత్రలో రేసు గెలిచిన రెండో మహిళా డ్రైవర్‌గా వోల్వెండ్ నిలిచింది. ఈ రేసింగ్‌కు హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ యజమాని అక్కినేని నాగచైతన్య, ఇతర జట్లకు చెందిన జాన్ అబ్రహం, సౌరవ్ గంగూలీ, కిచ్చా సుదీప్ హాజరై సందడి చేశారు.