రంగారెడ్డి, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ) : పెండింగ్లో ఉన్న మూడు నెలల వేతనాలు ఇవ్వాలని మంగళవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగా అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తుందని ఆశించామని, కానీ.. మూడు నెలలు అవుతున్నప్పటికీ జీతాలు ఇవ్వడం లేదని వాపోయారు. టీచర్లు ఆయాలు జీవనం కొనసాగించాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నదని, రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మే నెలలో వేసవి సెలవులు ఇవ్వాలని, కనీస వేతనంగా రూ.26వేలు అందించాలని, పీఎఫ్, ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజు, యూనియన్ జిల్లా కార్యదర్శి కవిత, అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, సీఐటీయూ ఉపాధ్యక్షుడు బ్రహ్మయ్య, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు పోచమోని కృష్ణ, సీహెచ్ ఎల్లేష్, అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకురాలు, అంగన్వాడీ యూనియన్ జిల్లా కోశాధికారి లక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షురాలు నాగమణి, జిల్లా నాయకులు వైదేవి, బేబీ బాలమణి, జయమ్మ, యాదమ్మ, లక్ష్మి, జ్యోతి, సుకన్యలతోపాటు 600 మంది అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.