బొంరాస్పేట, ఆగస్టు 10 : అంగన్వాడీ కేంద్రాలు కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. కేంద్రాల వైపు చిన్నారులు ఆకర్షితులయ్యే విధంగా వాటిని తీర్చిదిద్దుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను మూడేండ్లు నిండేసరికి అంగన్వాడీ కేంద్రాలకు పంపించకుండా ఎల్కేజీ, యూకేజీ చదువుల కోసం ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు. ప్రైవేటుకు అడ్డుకట్ట వేయడంతో పాటు అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక పాఠశాలలుగా పేరు మార్చింది. ఇప్పటి వరకు అంగన్వాడీ కేంద్రం బోర్డులు నీలి రంగులో ఉండేవి. కొత్తగా రూపొందిన బోర్డులపై ‘అంగన్వాడీ పూర్వ ప్రాథమిక పాఠశాల’ అని తెలుగులో, ‘అంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూల్’ అని ఆంగ్లంలో రాయించారు. బోర్డులోని రెండు చివరల రెండు లోగోలు ఉన్నాయి. మధ్యలో తెలంగాణ ప్రభుత్వం లోగో ఉన్నది. జిల్లాలోని 1107 అంగన్వాడీ కేంద్రాల్లో ఈ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
భవనాలకు రంగులు..
పక్కా భవనాలున్న, ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదుల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలను ప్రభుత్వం కల్పించనున్నది. చిన్నారులకు తాగునీరు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు వంటి వాటిని ఏర్పాటు చేయనున్నారు. వికారాబాద్ జిల్లాలో 1107 అంగన్వాడీ కేంద్రాలకుగాను 668 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయి. 175 కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లోని తరగతి గదుల్లో కొనసాగుతుండగా, 264 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. సొంత భవనాలతో పాటు పాఠశాలల ప్రాంగణాల్లో కొనసాగుతున్న కేంద్రాలకు రంగులు వేస్తున్నారు.
కొత్తగా రెండు పుస్తకాలు..
చిన్నారులకు బోధించడానికి అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం కొత్తగా రెండు పుస్తకాలను అందజేసింది. పూర్వ ప్రాథమిక విద్యా కరదీపిక, ప్రియదర్శిని అని రెండు పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రతి నెలా పిల్లలకు బోధించే అంశాలను ఈ పుస్తకాల్లో పొందుపర్చారు. చిన్నారులకు నేర్పించాల్సిన మంచి అలవాట్లు, పాటలు, విద్యార్థుల మధ్య సంభాషణ, పూర్వ గణిత భావనలు, ఆటలు వంటి వాటివి ఉన్నాయి. చిన్నారుల్లో సృజనాత్మకత పెంచేవిధంగా బొమ్మలు వేయడం, చేతి ముద్రలు వేయడం వంటి వాటిని నేర్పడంతో పాటు చిన్నారుల్లో ఆసక్తిని కలిగించే కథలు చెప్పాలి.
అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్పటి వరకు కొనసాగిన ఆటపాటలతో కూడిన బోధనతో పాటు కొత్తగా ఇచ్చిన పుస్తకాలు చిన్నారులకు ఎంతో ఉపయోగపడనున్నాయి. వీటిని బోధించడంపై అంగన్వాడీ టీచర్లకు శిక్షణ కూడా ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా అందజేస్తున్న యూనిఫాంలాగే అంగన్వాడీల్లో చదివే చిన్నారులకూ ప్రభుత్వం ఒక జత యూనిఫాం అందించనున్నది. వీటిని మహిళా సంఘాల ద్వారా కుట్టించే పని కొనసాగుతున్నది. జిల్లాలో ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టులు, 1107 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, వీటిలో ఏడు నెలల నుంచి 3 ఏండ్లలోపు చిన్నారులు 43,497 మంది, 3 నుంచి 6 సంవత్సరాలలోపు చిన్నారులు 19,693 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.