Kodangal | కొడంగల్, జులై 11 : సీఎం ఇలాకాలో ఆంధ్రా కాంట్రాక్టర్లు నాణ్యత లేని బీటి రోడ్లు చేపడుతున్నారని మాజీ జడ్పీటీసీ కోట్ల మహిపాల్ ఆరోపించారు. ఈ సందర్బంగా అయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలంలోని గోక పస్లాబాద్, బోడమర్రి తండా గ్రామానికి వేసిన రోడ్లు నాణ్యత లేకుండా ఉన్నాయని, స్థానిక కాంగ్రెస్ నాయకులు కానీ, తిరుపతి రెడ్డి కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.
నియోజకవర్గంలో వేస్తున్నటువంటి బీటీ రోడ్లను ఆంధ్ర కాంట్రాక్టర్లకు 20 శాతం కమిషన్కు కట్టబెడితే వాళ్ళు రోడ్లు అధ్వాన్నంగా నాణ్యత లేకుండా వేస్తున్నారని తెలిపారు. స్థానిక నాయకులకు,కార్యకర్తలకు పదవులు ఇవ్వకుండా ఆంధ్రా కాంట్రాక్టర్ల జెసిబిల కింద, టిప్పర్ల కింద కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను లేబర్లుగా పెట్టుకొని కమిషన్లకు కక్కుర్తి పడుతున్నట్లు ఆరోపించారు. కొడంగల్ ప్రజలను ఆంధ్ర నాయకుల లేబర్లుగా పెట్టుకొని రోడ్లను అధ్వాన్నంగా నాణ్యత లేకుండా వేస్తున్నారు అని అన్నారు. వెంటనే రోడ్డు నాణ్యత పెంచి ప్రజలకు అందుబాటులో ఉంచాలని, లేని యెడల భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మండల ఎంపీటీసీ సంఘాల అధ్యక్షుడు కేశవరెడ్డి, మాజీ జడ్పీటీసీ వెంకటమ్మ, పకిరప్ప ముదిరాజ్, సంఘ అధ్యక్షుడు తోక ఆశప్ప, మాజీ సర్పంచ్లు భీములు, రాజు యాదవ్, కర్రే మహిపాల్, బాలరాజ్, రమేష్, అప్పి రాజ్, వెంకటయ్య తదితరులు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.