వికారాబాద్, మే 13 : నీట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించే చేతగాని కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. దాదాపు 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ అంధకారం చేసిన కేంద్ర సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలు కూడా పకడ్బందీగా నిర్వహించలేని, దయనీయ స్థితిలో కేంద్ర విద్యాశాఖ ఉందన్నారు.
నీట్ పేపర్లు పరీక్ష కంటే రెండు రోజుల ముందే మార్కెట్లో రావడం దురదృష్టకరమన్నారు. దీనికి బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి తప్పులు జరగకుండా చూడాలని మండిపడ్డారు. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఇస్తామన్న ఉద్యోగాలను ఎగ్గొట్టిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు విద్యార్థులను కూడా సరైన విధంగా చదువుకోనివ్వడం లేదని మండిపడ్డారు. పరీక్ష రాసిన పిల్లలందరికీ ఎంత మానసిక క్షోభ కలుగుతుందో ఈ సర్కారుకు తెలియదా అని ప్రశ్నించారు. గడిచిన తొమ్మిది సంవత్సరాల్లో నాలుగుసార్లు నీట్ పరీక్ష లీక్ కావడం అంటే గవర్నమెంట్ ఎంత బ్రహ్మాండంగా పని చేస్తున్నదో అర్థమవుతుందన్నారు. విద్యావ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి, ప్రక్షాళన చేసి విద్యార్థులకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.