ఇబ్రహీంపట్నంరూరల్, డిసెంబర్ 28 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన పశుసంచార వాహనాల ద్వారా మూగజీవాలకు తక్షణ వైద్య సేవలు అందుతున్నాయి. ప్రభుత్వం 108 తరహాలో 1962నంబర్ వాహనాలను ప్రతి నియోజకవర్గానికి ఒక్కటిచొప్పున అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో నేడు మారుమూల గ్రామాల్లోని మూగజీవాలకు ఏదైనా ప్రమాదం జరిగితే రైతులు 1962నంబర్‌ను సంప్రదించిన వెంటనే క్షణాల్లో సిబ్బంది వాహనం ద్వారా అక్కడకు చేరుకుని సత్వర వైద్యసేవలు అందిస్తుండడంతో గ్రామీణ ప్రాంత రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
గతంలో మూగజీవాలకు ఎలాంటి ప్రమాదం జరిగినా పశువైద్యశాలకు తీసుకువచ్చేందుకు ఎంతో వ్యయప్రయాసాలను ఎదుర్కొనేవారు. ఇలాంటి ఇబ్బందులను దూరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సంచార వాహనం ద్వారా సేవలు అంది మూగజీవాలకు ఎలాంటి ప్రమాదమున్నా, అలాగే, డెలీవరీ సమయంలో ఇబ్బంది ఉన్నా వెంటనే రైతులు 1962 నంబర్‌కు డయల్ చేస్తే క్షణాల్లోనే వాహనాలు ఘటనా స్థలాలకు చేరుకుని చికిత్స అందిస్తున్నారు.
మూగజీవాల సంరక్షణకు సంచార వాహనం
ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ నాటికి జిల్లా వ్యాప్తంగా ఉన్న 5 పశుసంచార వాహనాల ద్వారా 49,670వేల మూగజీవాలకు 1962 సంచార వాహనం ద్వారా సిబ్బంది చికిత్సలు అందిస్తున్నారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, షాద్‌నగర్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లోని మారుమూల గ్రామాల్లో అత్యవసర వైద్యంకింద మూగజీవాలు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలకు వైద్యసేవలు అందుతున్నాయి.
సంచార వాహనంలో వైద్య పరికరాలు..
1962పశుసంచార వాహనంలో మూగజీవాలకు సంబంధించిన అన్ని రకాల మందులతో పాటు చికిత్సలు నిర్వహించేందుకు మైక్రోస్కోప్, ట్రైమాక్వాన్, ఆక్సిజన్సప్లయ్ పరికరం, చిల్లక్టీకాస్కోప్, గ్లూకోజ్బాటిళ్లు, మందులతో పాటు సంచార వాహనంలో పశువైద్యాధికారితో పాటు ప్యారాస్టాప్, అటెండర్, పైలెట్ నలుగురు చొప్పున ప్రతి వాహనానికి అందుబాటులో ఉంటారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 5 సంచార వాహనాల్లో మొత్తం 20మంది సిబ్బందితో పాటు అదనంగా 5మంది ప్రతిక్షణం అందుబాటులో ఉంటారు.
పశువులకు సరైన వైద్య సేవలు..
ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా ఉన్న 5 పశుసంచార వాహనాల ద్వారా ముప్పైఐదువేల మూగజీవాలను కాపాడగలిగాం. ఈ వాహనాలు 108తరహాలో సరైన వైద్యసేవలందిస్తున్నాం. ఎక్కడా ఎలాంటి సమస్యలున్నా తమకు ఫోన్ వచ్చిన వెంటనే ఘటనా స్థలాలను చేరుకుని సరైన చికిత్సలు అందిస్తున్నాం. సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండటంతో పాటు వైద్య చికిత్సలకు సంబంధించిన అన్ని పరికరాలు వాహనాల్లో అందుబాటులో ఉంచాం.
– రమేశ్, పశుసంచార వాహనాల జిల్లా కో ఆర్డినేటర్