బొంరాస్‌పేట, ఏప్రిల్ 27 : అంబలి.. మండు వేసవిలో, కరువు కాలంలో కాసింత అంబలి తాగితే దాహం తీరడమే కాదు ఆకలి కూడా
తగ్గుతుంది. రాష్ట్రంలోని ప్రజలకు వేసవిలో దూప తీర్చే అతి ముఖ్యమైన ద్రవ రూప ఆహారం ఇది. తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు, పాదచారులకు అంబలి పోసి వారి దప్పికను తీర్చుతున్నారు సేవాతత్పరులు. రేగడిమైలారం గ్రామానికి సమీపంలో అంతర్రాష్ట్ర రహదారి పక్కన ఏర్పాటు చేసిన అంబలి కేంద్రం గ్రామస్తులు, దారిన వెళ్లే వారి దాహాన్ని తీర్చుతున్నది. బసవన్న ఆలయం దగ్గర గ్రామానికి చెందిన తారాపురం నీలప్ప, సిద్ధిలింగప్ప, ఈరప్ప, బస్వరాజు కుటుంబీకులు ప్రతి ఏటా అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఐదు వారాలపాటు ప్రతిరోజూ పంపిణీ చేస్తున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి అంబలి అయిపోయే వరకు మహిళలు అక్కడే ఉండి దారిన వెళ్లే పాదచారులు, గ్రామస్తులు, రైతులకు పంపిణీ చేస్తుంటారు. ప్రతి బుధవారం రేగడిమైలారం గ్రామానికి చెందిన చాలామంది పాత్రలతో వచ్చి అంబలిని తీసుకెళ్తుంటారు. దారిన పోయేవారు అక్కడ కొద్దిసేపు ఆగి అంబలిని తాగి సేద తీరుతారు. రెండు గ్లాసుల అంబలి తాగితే ఎండాకాలంలో ఎంతో హాయిగా, చల్లగా ఉంటుంది.
120 ఏండ్ల నుంచి..
గ్రామానికి చెందిన తారాపురం కుటుంబీకులు సుమారు 120 ఏండ్ల నుంచి ఈ అంబలి కేంద్రాన్ని కొనసాగిస్తున్నారు. పూర్వకాలంలో వాహన సౌకర్యం లేనప్పుడు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలతోపాటు రేగడిమైలారం గ్రామానికి చెందిన వారు కూడా కొడంగల్‌లో ప్రతి బుధవారం జరిగే సంతకు కాలినడకన వెళ్లే వారు. అలా అంగడికి వెళ్లే వివిధ గ్రామాల వారికి, పొలాలకెళ్లే రైతులకు దాహం వేస్తే అంబలి ద్వారా దూప తీర్చాలని ఈ కుటుంబానికి చెందిన వారు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తమ పొలాల్లో పండే తెల్లజొన్నల ద్వారా అంబలిని తయారు చేసి పంపిణీ చేస్తున్నారు. తారాపురం కుటుంబానికి చెందిన రేగడి పొలాల్లో ప్రస్తుతం తెల్ల జొన్నలు పండకున్నా వాటిని మార్కెట్లో కొనుగోలు చేసి అంబలి కాచి అందజేస్తున్నారు. ప్రతి బుధవారం అంబలిని తయారు చేసేందుకు 15 కిలోల జొన్నలు అవసరమవుతాయి. కుటుంబంలోని అంద రూ కలిసి ఈ ఖర్చును భరిస్తూ తమ పూర్వీకుల ఆచారాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. తారాపురం కుటుంబీకులు ధనవంతులు కారు. ఏటా శ్రీరామ నవమి తర్వాత అంబలి కేంద్రాన్ని ప్రారంభించి ఐదు వారాలపాటు కొనసాగిస్తారు. బసవ జయంతి రోజున వారు బసవన్న ఆలయం దగ్గర అన్నదానం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు.
ఆకలిని తగ్గిస్తుంది
అంబలి ఆకలిని తగ్గిస్తుంది. రాగులతో తయారు చేసిన అంబలిలో క్యాల్షి యం, మినరల్స్ ఎక్కువగా ఉండటం తో కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతుంది. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది.. త్వరగా జీర్ణమవుతుంది. గర్భిణులు అంబలిని తీసుకోవడం ద్వారా పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. గోధుమలు, జొన్నలతో తయారు చేసిన అంబలిలో ప్రొటీ న్లు, విటమిన్లు ఉంటాయి. అంబలిలో ఉప్పు వేసి తయారు చేయడం వల్ల వేసవిలో ఎండ వేడిమికి శరీరం కోల్పోయే సోడియం, పొటాషియాన్ని అం దిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం అంబలి. -రవీంద్రయాదవ్, వైద్యుడు
బొంరాస్‌పేటలో
మండల కేంద్రంలోని నైబర్‌హుడ్ కేంద్రం ఆవరణలో గత కొన్నేండ్లుగా పొట్ట రామయ్య, పొట్ట నర్సయ్య ఆధ్వర్యంలో అంబలి కేంద్రం కొనసాగుతున్నది. ఉగాది పండుగ తర్వాత మొదలై వర్షాకాలం ప్రారంభం అయ్యేవరకు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి ప్రజలు, గ్రామస్తులు, పాదచారులకు అంబలి కాసి పంపిణీ చేస్తున్నారు. ఇక్కడ రాగి అంబలి ప్రత్యేకం. కరోనా వైరస్ కారణంగా రెండు చోట్ల రెండేండ్లు విరామం ప్రకటించినా కరోనా తగ్గడంతో ఈ ఏడాది అంబలి కేంద్రాలను మళ్లీ ప్రారంభించారు.