కడ్తాల్ : హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సిద్ధాంతాలు మరిచి కుమ్మక్కయ్యాయని, అనైతికంగా పొత్తు పెట్టుకుని టీఆర్ఎస్ పార్టీని ఓడించాయని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో స్థానిక టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను ఓడించడానికి, దేశంలోనే బద్ధ శత్రువులైన రెండు జాతీయ పార్టీలు ఒక్కటయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలు కుట్రలు, కుతాంత్రాలతో పార్టీ నియమాలకు విరుద్ధంగా కలిసిపోయి టీఆర్ఎస్ని ఓడించాయని ఆరోపించారు.
2018 సాధారణ ఎన్నికల్లో 61,121 ఓట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ, ఈ ఉప ఎన్నికల్లో 3112 ఓట్లే రావడానికి కారణమేంటని, మిగతా ఓట్లు ఎక్కడకి పోయాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు బీజేపీ పార్టీకి అమ్ముడుపోయి, నైతిక విలువలను మరిచిపోయి తమ పార్టీ ఓట్లని బీజేపీ అభ్యర్థికి వేయించారని ధ్వజమెత్తారు. బీజేపీతో కుమ్ముకు రాజకీయం చేసిన కాంగ్రెస్ రాష్ట్రంలో ఉనికి లేకుండా పోతుందన్నారు. టీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని, చట్టాలను గౌరవిస్తుందని, ప్రజా తీర్పును శిరసావహిస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్ పేద ప్రజల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్నారని, రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి నిర్ధిష్టమైన ప్రణాళికలతో ముందుకెళ్తున్నారని పేర్కొన్నారు.
ఈ నెల 29న వరంగల్లులో నిర్వహించే విజయగర్జనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్ నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పరమేశ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు వీరయ్య, ఏఎంసీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.