రంగారెడ్డి, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు క్రియాశీలక పాత్ర పోషించిన ఇందిరమ్మ కమిటీలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం ప్రతి పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో కమిటీలను ఏర్పాటు చేయాలని ఇటీవలనే ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కమిటీల ఏర్పాటుపై రంగారెడ్డి జిల్లాలో అధికారులు దృష్టి సారించారు. అయితే కమిటీల ఏర్పాటు సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలపై ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యానికి ఆస్కారం ఉండడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కమిటీలో క్రియాశీలక సభ్యులే..
ఇందిరమ్మ కమిటీల పేర్లను ఆగమేఘాల మీద పంపాలని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత శనివారం కమిటీలను పూర్తి చేసి పంపాల్సి ఉండగా.. దసరా పండుగ, ఆదివారం సెలవు ఉండడంతో సాధ్యపడలేదు. దీంతో గత రెండు రోజులుగా అధికారులు ఈ కమిటీల ఏర్పాటుపైనే దృష్టి పెట్టారు. జిల్లాలోని 558 గ్రామపంచాయతీలతోపాటు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఏడుగురు సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామపంచాయతీ స్థాయిలో ఏర్పాటు చేసే కమిటీకి సర్పంచ్ లేదా పంచాయతీ ప్రత్యేకాధికారి చైర్మన్‌గా, పంచాయతీ కార్యదర్శి కన్వీనర్‌గా ఉంటారు.
మున్సిపల్ వార్డుస్థాయిలో వార్డు కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ చైర్మన్‌గా, వార్డు అధికారి కన్వీనర్‌గా ఉంటారు. ఈ రెండు కమిటీల్లో.. స్వయం సహాయక సంఘాల నుంచి ఇద్దరు మహిళలు, గ్రామ, మున్సిపల్ వార్డు అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా ఉండే ముగ్గురిని సభ్యులుగా నియమించనున్నారు. ఈ ముగ్గురిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున నియమించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం సూచించింది. కమిటీల్లో నియమించేవారి పేర్లను ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లు కలెక్టర్‌కు పంపితే.. కలెక్టర్ ఆ వివరాలను జిల్లా ఇన్చార్జి మంత్రికి వివరించి ఖరారు చేయాల్సి ఉంటుంది. జిల్లాలో కమిటీల ఎంపిక ప్రక్రియ చురుగ్గా సాగుతున్నది. ఇప్పటికే నాలుగైదు మండలాల్లో కమిటీలు పూర్తయినట్లు తెలిసింది. అయితే క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా ఉండే కార్యకర్తలనే ఇందిరమ్మ కమిటీల్లో చోటు కల్పించాలని కాంగ్రెస్ నేతల నుంచి అంతర్గతంగా సందేశాలు వెళ్తుండడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎంపిక పారదర్శకమేనా..!
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో కమిటీలే క్రియాశీలక పాత్ర పోషించనున్నాయి. ఈ కమిటీలు ఇందిరమ్మ పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు గ్రామ, మున్సిపల్ వార్డు స్థాయిల్లో అవగాహనను పెంపొందించే కార్యక్రమాలను చేపడుతాయి. ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు సహాయంగా ఉండడంతోపాటు సోషల్ ఆడిట్‌ను నిర్వహించనున్నాయి. అర్హులకు ఇల్లు అందకపోవడం.. అలాగే అనర్హులకు దక్కడం వంటివి ఏమైనా జరిగితే.. ఆ వివరాలను ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లడంలో కమిటీలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇందిరమ్మ కమిటీల పేరుతో కాంగ్రెస్ నాయకుల అనధికార పెత్తనం ఉండే అవకాశం ఉన్నదని ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరం తెలుపుతున్నాయి.
కమిటీల ఖరారు కలెక్టర్, ఇన్చార్జి మంత్రి ద్వారానే ఖరారు కానుండగా.. అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఎంపిక ప్రక్రియ జరుగనున్నదన్నది బహిరంగ రహస్యమే. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నచోట ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇచ్చే జాబితాకే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. రాజకీయ నేతల జోక్యంతో ఏర్పడ్డ ఈ కమిటీలే లబ్ధిదారుల ఎంపికలోనూ క్రియాశీలక పాత్ర పోషించనుండడంతో వివిధ వర్గాలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి.
నియోజకవర్గానికి 3,500 ఇండ్ల కేటాయింపు..
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద రూ.5లక్షలు, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకైతే రూ.6లక్షల ఆర్థిక సాయాన్ని మూడు విడుతలుగా అందజేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక గత డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించి ఇందిరమ్మ ఇండ్లకు సైతం దరఖాస్తులను స్వీకరించింది. ఇండ్లు నిర్మించుకునేందుకు జిల్లావ్యాప్తంగా లక్షకుపైగా దరఖాస్తులు వచ్చాయి. నియోజకవర్గానికి 3,500 ఇండ్లను నిర్మిస్తామని ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. ఈ లెక్కన జిల్లాలోని 8 నియోజకవర్గాలకు 28వేల వరకు ఇండ్లను కేటాయించనున్నారు. ఈ దరఖాస్తులను సైతం ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని ఇందిరమ్మ కమిటీలకు అందించనున్నట్లు తెలుస్తున్నది.