Shabad | షాబాద్, జూన్ 6 : పంటల సాగులో రైతులు యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ సతీశ్, శ్రీనివాస్‌రెడ్డి, శీరిష అన్నారు. శుక్రవారం షాబాద్ మండల పరిధిలోని చందనవెళ్లి, రేగడిదోస్వాడ గ్రామాల్లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సతీశ్ మాట్లాడుతూ.. రైతులు పంటల సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని చెప్పారు. ముఖ్యంగా వరి పంటలో నారుమడి యాజమాన్యం, నీటి యాజమాన్యం, ఎరువులు యాజమాన్యం గురించి రైతులకు వివరించారు. పత్తి, కంది పంటలో వచ్చే చీడపీడల నివారణ గురించి వివరిస్తూ, పంట మార్పిడి పద్ధతిని విధిగా పాటించాలని రైతులకు సూచించారు.
ఆర్థిక శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్రెడ్డిమాట్లాడుతూ.. పంట ఖర్చులు తగ్గించేందుకు రైతులు సమైఖ్యంగా ఉండి సాగుబడి, మార్కెటింగ్ కలిసికట్టుగా చేయాలని కోరారు. పంట దిగుబడి మాత్రమే కాకుండా నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు.
శాస్త్రవేత్త శీరిష మాట్లాడుతూ.. పంటలకు అవసరం మేర మాత్రమే యూరియా, డిఎపి ఎరువులను వాడాలన్నారు. రైతులు తమ సొంత విత్తనాలతోనే మూడు నుంచి నాలుగు సంవత్సరాలు విత్తనోత్పత్తి చేసుకోవాలని, వ్యవసాయ ఆధారిత సలహాలు, సూచనలు పాటించాలని సూచించారు. మట్టి పరీక్షలు నిర్వహించి అవసరం మేరకే రసాయనాలు వినియోగించి నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడాలని రైతులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయశాఖ అధికారి వెంకటేశం, ఏఈఓలు రాజేశ్వరి, గీత, రిసెర్చ్ స్కాలర్స్ అవనీజ, మిలింద్, అంగన్వాడి టీచర్ శ్రీలత, వ్యవసాయ పరిశోధన విద్యార్థి శ్రవణ్‌కుమార్, సహకార సంఘం వైస్ చైర్మన్ మద్దూరి మల్లేశ్, చేవెళ్ల స్వామి, రైతులు తదితరులు పాల్గొన్నారు.