చేవెళ్ల రూరల్, మే 30 : రైతులు విత్తనాల కొనుగోలులో జాగ్రత్తలు వహించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. గురువారం చేవెళ్ల మండల పరిధిలోని రేఘడిగణాపూర్, ఆలూర్ గ్రామాల్లో నకిలీ విత్తనాలు, విత్తనాల కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. రైతులు లూజుగా ఉన్న సంచుల్లో విత్తనాలు కొనుగోలు చేయరాదని, విత్తనాలు కొనుగోలు చేసిన షాపు నుంచి రసీదు తీసుకొని, విత్తన ప్యాకెట్, బిల్లును పంటకాలం పూర్తయ్యే వరకు భద్రంగా దాచుకోవాలన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన అధీకృత డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని తెలిపారు. కార్యక్రమాల్లో మండల వ్యవసాయ విస్తరణాధికారులు రాజేశ్వర్‌రెడ్డి, బాలకృష్ణ, మాజీ సర్పంచ్ రాయికంటి నర్సింహులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : పంటల సాగుకోసం కొనుగోలు చేసే విత్తనాల విషయంలో రైతులు వ్యవసాయాధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని ఇబ్రహీంపట్నం వ్యవసాయ విస్తరణాధికారి శ్రవణ్‌కుమార్ అన్నారు. మండల పరిధిలోని రాయపోల్ గ్రామంలో రైతులకు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతులు సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఎలాంటి ఇబ్బందులున్నా వెంటనే అధికారులను సంప్రదించాలని సూచించారు. ఎక్కడైనా కల్తీ విత్తనాల విషయం బయటకొస్తే చర్యలు తప్పవని ఆయన తెలిపారు. కార్యక్రమంలో రాయపోల్ మాజీ సర్పంచ్ బల్వంత్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
కడ్తాల్ : రైతులు విడిగా సంచుల్లో లభించే విత్తనాలను కొనుగోలు చేయవద్దని మండల వ్యవసాయ శాఖ విస్తరణాధికారులు రమణ, వందన, అభినవ్, కేదార్‌సింగ్ అన్నారు. వానకాలం పంటల సాగుపై మండల పరిధిలోని రావిచేడ్, అన్మాస్‌పల్లి, ముద్విన్, సాలార్‌పూర్ గ్రామాల్లోని రైతులకు అధికారులు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పంటల సాగులో అధికారుల సూచనలు, సలహాలను పాటించాలని తెలిపారు. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో బిల్లులు, రసీదులు పొంది, వాటిని పంట కాలం పూర్తయ్యే వరకు భద్రపరుచుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు గోపాల్, ప్రియ, ఆయా గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.
మండలంలోని పలు విత్తనాల షాపులను గురువారం మండల వ్యవసాయ శాఖ అధికారిణి శ్రీలత తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షాపుల్లోని రికార్డులు, విత్తనాల, ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విత్తనాలు కొనుగోలు చేసే రైతులకు విధిగా రసీదులు అందజేయాలని, షాపుల ఎదుట ధరల పట్టికకు సంబంధించిన బోర్డులను ఉంచాలని సూచించారు. నకిలీ విత్తనాలను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆమనగల్లు : అధీకృత ఫర్టిలైజర్ డీలర్లు రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే లైసెన్స్ రద్దుతో పాటు కఠిన చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారిణి అరుణకుమారి డీలర్లను హెచ్చరించారు. గురువారం మండల కేంద్రంలోని పలు అధీకృత డీలర్ దుకాణాలను ఏవో అరుణకుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, విత్తన, మందుల నిల్వలను పరిశీలించారు. అనంతరం ఏవో అరుణకుమారి మాట్లాడుతూ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు రైతులకు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని ఆమె అన్నారు. దుకాణాల ఎదుట స్టాక్ వివరాలు, ధరల పట్టికను ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు రసీదులు తప్పనిసరిగా ఇవ్వాలని షాప్ నిర్వాహకులకు ఏవో సూచించారు. అంతకుముందు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల పరిధిలోని సింగంపల్లి, ఆకుతోటపల్లి, ఆమనగల్లు మున్సిపాలిటీ, సంకటోనిపల్లి గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈవోలు, రైతులతో సమావేశమై సాగులో అవలంబించాల్సిన పద్ధతులు, సూచనలు, సలహాలను రైతులకు వివరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కమఠం రాధమ్మ, ఏఈవోలు రాణి, సాయిరాం, శివతేజ, రైతులు పాల్గొన్నారు.
కొత్తూరు : విత్తనాలు విత్తిన తర్వాత ప్యాకెట్లను భద్రంగా ఉంచుకోవాలని షాద్‌నగర్ ఏడీఏ రాజరత్నం రైతులకు సూచించారు. కొత్తూరు మండలంలోని గూడూరు గ్రామ పంచాయతీ పరిధిలొని రాగ్యా తండాలో రైతులకు విత్తనాల కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏడీఏ రాజారత్నం, ఎంపీపీ మధుసూదర్‌రెడ్డి హాజరై రైతులకు పలు సూచనలు చేశారు. అవగాహన సదుస్సులో ఏఈవో నిఖిత, రైతులు పాల్గొన్నారు.
మంచాల : విత్తనాల కొనుగోళ్లలో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారిణి జ్యోతిశ్రీ అన్నారు. గురువారం మంచాల మండలం ఆరుట్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో కృషి విజ్ఞాన కేంద్రం రంగారెడ్డి, మంచాల వ్యవసాయ శాఖ వారి సహకారంతో పత్తి విత్తన సంస్థలు రాశీసీడ్స్, సీడ్వర్క్ వారి ఆధ్వర్యంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ.. పత్తి సాగులో రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. పత్తిలో రాశీసీడ్స్ ఆర్సీహెచ్-971, ఆర్సీహెచ్ 929 సీడ్స్ అనుకూలమైన విత్తన రకమని రైతులు అవసరమున్న వారు ఈ విత్తనాలను కొనుగోలు చేయాలని కోరారు. తప్పనిసరిగా రైతులు భూసార పరీక్షలు చేయించుకున్న తర్వాతనే పంటలను సాగు చేసుకోవాలని అన్నారు. సమావేశంలో ఎంపీటీసీ కావలి శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారులు విజయ్‌కుమార్, లింగస్వామి, మాజీ సర్పంచ్ విష్ణువర్ధన్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.