మంచాల, జూన్ 1: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి నుండి జాపాలకు వచ్చే ప్రధాన రహదారి మొత్తం గుంతల మయంగా మారింది. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు నిత్యం నరకయాతన పడుతూ ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. జాపాల నుంచి ఆగపల్లి వరకు ఐదు కిలోమీటర్ల మేర రోడ్డు ఉంది. ఈ రోడ్డు ఎటు చూసినా గుంతలతో పాటు కంకర తేలి అధ్వాన్నంగా మారింది. దీంతో రోడ్డు మరమ్మతుల కోసం గత ప్రభుత్వం 3.80కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ పనులు మాత్రం ముందుకు సాగకపోవడంతో నిత్యం వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
రాత్రి సమయంలో ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే వాహనదారులు జంకుతున్నారు. ఎక్కడ ఏ గుంత ఉందో తెలియకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అదేవిధంగా ప్రధాన రహదారి సింగిల్ రోడ్డు కావడంతో పాటు రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్టు కొమ్మలు రోడ్లపైకి రావడంతో వాహదారులు రోడ్డుతో పాటు రోడ్డుపైకి వచ్చిన చెట్టు కొమ్మలతో నిత్యం నరకాన్ని చూస్తున్నారు. జాపాల, రంగాపూర్, అస్మత్పూర్, చాంద్ఖాన్గూడ గ్రామాలకు చెందిన వారు వివిధ పనుల నిమిత్తం ఇబ్రహీంపట్నం, హైదరాబాద్కు నిత్యం వెళ్తుంటారు. రోడ్డు గుంతలుగా ఉన్న తప్పని పరిస్థితిలో వాహనదారులు గుంతల రోడ్డుపైనే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆగపల్లి నుంచి మంచాల వరకు రోడ్డు వెడల్పు కోసం గత ప్రభుత్వం 3.80 కోట్లు కేటయించినప్పటికీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. ఇకనైనా అధికారులు ఈ రోడ్డు పరిస్థితిని గుర్తించి రోడ్డు మరమ్మతు పనులను వేగవంతం చేయాలని వాహనదారులు కోరుతున్నారు.