కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన అనంతరం కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల బతుకులు ఆగమయ్యాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి గెలిపిస్తే ఇబ్బందులపాలు చేయడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జీతాలు సమయానికి రావడంలేదు. ఏ ఒక్క శాఖనో కాకుండా అన్ని శాఖల ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. ఈఎంఐలు కట్టలేక చతికిలపడుతున్నారు. అప్పులు చేస్తూ కుటుంబాలను పోషిస్తున్నారు. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న జీతాలతోపాటు ఇకపై ప్రతి నెల సమయానికి జీతాలు అందజేయాలని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ సర్కారు ఉంటే సమయానికి జీతాలతోపాటు ఉద్యోగాలు రెగ్యులర్ అయ్యే అవకాశాలు ఉండేవని ఆశాభావం వ్యక్తం చేశారు.
– వికారాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ)
ప్రభుత్వాసుపత్రుల్లో నిలిచిన ఉచిత భోజనం
పేదల సంక్షేమం కోసం బీఆర్ఎస్ సర్కారు అమలు చేసిన కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటిగా నిలిచిపోతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవమైతే కేసీఆర్ కిట్స్తోపాటు అందించిన ఆర్థిక సాయం గతేడాదిగా నిలిచిపోయింది. గర్భిణులకు సరైన పోషకాలు అందిస్తేనే ఆరోగ్యంగా ఉంటారని, పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యవంతులుగా ఉంటారని గుర్తించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన న్యూట్రిషన్ కిట్స్ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బంద్ అయ్యాయి.
అంతేకాకుండా ప్రభుత్వాసుపత్రుల్లో డెలివరీ అయిన మహిళలకు కేసీఆర్ హయాంలో పది రోజులపాటు ఉచితంగా భోజనం అందించేందుకు నిధులందేవి. కాని ప్రస్తుత సర్కారు దీనిని పట్టించుకోకపోవడంతో ప్రభుత్వాసుపత్రుల్లో ఉచిత భోజనం బంద్ అయింది. దీంతో పేద ప్రజలు ఆసుపత్రుల్లో ఉన్నన్ని రోజులు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఒకపూట తిని మరో పూట పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొన్నది. అదేవిధంగా గత ప్రభుత్వం టీబీ రోగులకు ప్రతినెల రూ.500ల చొప్పున సాయం చేస్తూ వచ్చింది. టీబీ రోగులకిచ్చే ఆర్థిక సాయాన్ని కూడా రేవంత్ సర్కారు ఆపేసింది. దీంతో జిల్లాలోని 1600 మంది టీబీ వ్యాధిగ్రస్తులు ఇబ్బందులు పడుతున్నారు.
నెలల తరబడి అందని జీతం
జల్లావ్యాప్తంగా ఉపాధి హామీ ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు నెలల తరబడి జీతాలు రాక అవస్థలు పడుతున్నారు. ఏప్రిల్ నెలకు సంబంధించి జూలై రెండో వారం వచ్చినా జీతం అందలేదని ఆవేదన చెందుతున్నారు. ఉపాధి హామీలో పనిచేస్తున్న దాదాపు 500 మంది ఉద్యోగులు జీతం కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. వీరిలో ఆఫీస్ సబార్డినేట్లు మొదలుకొని కంప్యూటర్ ఆపరేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీలు ఉన్నారు.
జిల్లాలోని 94 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, 309 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు ఏప్రిల్ నెల నుంచి పెండింగ్లో ఉండగా, 12 మంది ఏపీవోలు, 13 మంది ఈసీలు, 49 మంది కంప్యూటర్ ఆపరేటర్లకు మే, జూన్ నెలలకు సంబంధించిన జీతాలు రావాల్సి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు జీతాల కోసం విన్నవిస్తున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ప్రభుత్వమే నిధులు విడుదల చేయడంలేదని, దీంతో జీతాలు పెండింగ్లో ఉన్నట్లు అధికార వర్గాలు తెలుపుతున్నారు.