Tanduru | తాండూర్ రూరల్, జూన్ 6 : రైతుల సమస్యలు పరిష్కరించేందుకు భూ భారతి చట్టంలో భాగంగా ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ అన్నారు. శుక్రవారం తాండూరు మండలం అల్లాపూర్ గ్రామంలోని రెవెన్యూ సదస్సును సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 20వ తేదీ వరకు ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సును నిర్వహిస్తున్నామని వివరించారు. సదస్సులో వచ్చిన ప్రతి అర్జీకి అధికారులు సమాధానం ఇవ్వాలని సూచించారు. తాసిల్దార్ స్థాయిలో ఉండే అర్జీలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఏ అర్జీలు వచ్చాయో వివరాల ఉండాలని తెలిపారు. రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకొని తమ భూ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. రైతుల పట్ల అధికారులు దురుసుగా ప్రవర్తించరాదని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ తారా సింగ్ సిబ్బంది తదితరులు ఉన్నారు.