షాబాద్, జూలై 14 : విద్యార్థులపై ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ.. బూతులు తిడుతూ.. ఇబ్బంది పెడుతున్న బాలుర పాఠశాల హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని షాబాద్ గ్రామస్తులు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం పాఠశాలకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు అక్కడ విద్యార్థులతో కలిసి ధర్నాకు దిగారు. తమ పిల్లలను బూతులు తిడుతూ.. కళ్లతో తన్ని న హెచ్ఎం గోవింద్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని భీష్మించి కూర్చున్నారు. వారికి పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి గీత, పీడీఎస్‌యూ ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్ మద్దతు తెలిపారు. జిల్లా కలెక్టర్, డీఈవో ఇక్కడికి వచ్చేదాకా వెళ్లేదిలేదని తేల్చిచెప్పారు.
విషయం తెలుసుకున్న డీఈవో సుశీందర్‌రావు హుటాహుటిన షాబాద్ పాఠశాలకు చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఉపాధ్యాయులతో కొద్దిసేపు మీటింగ్ నిర్వహించి హెచ్ఎంపై వస్తున్న ఆరోపణలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. షాబాద్ బాలుర పాఠశాలలో విద్యార్థిపై హెచ్ఎం చేయి చేసుకున్నట్లు పత్రికల్లో వచ్చిన వార్తలపై కలెక్టర్ ఆదేశానుసారం పాఠశాలను సందర్శించి వివరాలను సేకరించానని.. గతంలోనూ హెచ్ఎంపై పలు ఆరోపణలు తమ దృష్టికి రాగా వాటిపై విచారణ జరిపిస్తున్నట్లు చెప్పారు.
వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని హెచ్ఎం గోవింద్‌ను ఇక్కడి నుంచి బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. అతడి స్థానంలో మరో ఉపాధ్యాయుడికి ఇన్చార్జి బాధ్యతలను అప్పగిస్తామన్నారు. అనంతరం ఆయన షాబాద్ కేజీబీవీ పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. బాలికల ఉన్నత పాఠశాలలో హెచ్ఎం, ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని గ్రామస్తులు డీఈవోకు వినతిపత్రాన్ని అందించారు. విధు ల పట్ల నిర్లక్ష్యం చేసినా.. సమయపాలన పాటించకున్నా ఉపాధ్యాయులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఎంఈవో లక్ష్మణ్‌నాయక్, సిబ్బంది, గ్రామస్తులు తదితరులున్నారు.