రంగారెడ్డి, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని మున్సిపాలిటీల్లో అధికారులు, సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మున్సిపాలిటీలకు పాలకవర్గాలు లేకపోవటం.. ప్రత్యేకాధికారులు పట్టించుకోకపోవడంతో కిందిస్థాయి సిబ్బంది అవినీతి ఊబిలో కూరుకుపోయి మున్సిపల్ శాఖకు మాయని మచ్చగా మారుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికే నార్సింగి, ఆదిబట్ల మున్సిపాలిటీలకు చెందిన టౌన్‌ప్లానింగ్ అధికారులు ఏసీబీకి చిక్కారు. వీరు పెద్ద ఎత్తున లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడడంతో మున్సిపల్‌శాఖ పనితీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
మున్సిపాలిటీలకు ఆదాయాన్ని తెచ్చే టౌన్‌ప్లానింగ్, ట్యాక్సీల నిర్ధారణ, నల్లా కనెక్షన్లు, ట్రేడ్ లైసెన్స్‌ల జారీ వంటి కీలక విభాగాల్లో డబ్బులు లేనిదే పని జరగడంలేదన్న ఆరోపణలున్నాయి. ఈ విభాగాల్లోని సిబ్బం ది చేతులు తడపనిదే పనులు చేయడంలేదని పలువురు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివారు మున్సిపాలిటీలకు ప్రత్యేకాధికారులుగా జాయింట్ కలెక్టర్లు, సీడీఎంఏతోపాటు వివిధ విభాగాలకు చెందిన జిల్లా అధికారులను నియమించారు. వీరు తమకు కేటాయించిన మున్సిపాలిటీల మొహం కూడా చూడడం లేదని..అందుకే కింది స్థాయి సిబ్బంది రెచ్చిపోతున్నారని వినియోగదారులు మండిపడుతున్నారు.
జిల్లాలో 13 మున్సిపాలిటీలున్నాయి. వాటిలో ఆమనగల్లు, షాద్‌నగర్, తుక్కుగూడ, జల్పల్లి, నార్సింగి, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, శంషాబాద్, ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, తుర్కయాంజాల్, పెద్దఅంబర్‌పేట, మణికొండ మున్సిపాలిటీలతోపాటు బడంగ్‌పేట, బండ్లగూడజాగీర్, మీర్‌పేట కార్పొరేషన్లున్నాయి. వీటి పాలకవర్గాల పదవీకాలం ముగియడం తో ప్రభుత్వం పలువురు జిల్లా అధికారులకు ఒక్కొక్కరికి రెండు నుంచి మూడు చొప్పున మున్సిపాలిటీలకు ప్రత్యేకాధికారులుగా నియమించింది. ఈ ప్రత్యేకాధికారులు ఏడాది కావొస్తున్నా తమకు కేటాయించిన మున్సిపాలిటీల వైపు కన్నె త్తి చూడడంలేదు. దీంతో మున్సిపాలిటీల్లో ప్రతి పనికీ డబ్బులు ఇచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొన్నదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో టౌన్‌ప్లానింగ్ విభాగం కీలకమైంది. ఈ విభాగంలో టీపీవోల కొరత తీవ్రంగా ఉన్నది. ఒక్కో టీపీవో రెండు నుంచి మూడు మున్సిపాలిటీలకు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున నిర్మిస్తున్న కమర్షియల్ కాంప్లెక్స్‌లు, నివాస గృహాలకు టౌన్‌ప్లానింగ్ అధికారుల అనుమతి తప్పనిసరి. కానీ, ఆ అధికారులు డబ్బులు ఇవ్వనిదే అనుమతులివ్వడంలేదని పలువురు ఇండ్ల నిర్మాణదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. ఇప్పటికే నార్సింగి టీపీవో ఎల్ఆర్ఎస్ అనుమతి కోసం రూ. కోటి డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్ర యించగా.. ఆ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. తాజాగా ఆదిబట్ల మున్సిపాలిటీకి చెందిన టౌన్‌ప్లానింగ్ అధికారి వరప్రసాద్, ఆయన అసిస్టెంట్ వంశీ భవన నిర్మాణ అనుమతుల కోసం రూ.75 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.