శేరిలింగంపల్లి, మార్చి 6 : జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. అవినీతి నిరోధక శాఖ రంగారెడ్డి రేంజ్ డీఎస్పీ ఆనంద్‌కుమార్ అధ్వర్యంలో అధికారుల బృందం ఈ ఆకస్మిక సోదాలు చేపట్టారు. సర్కిల్లోని వివిధ విభాగాల్లో పెద్ద ఎత్తున ఈ సందర్భం గా సోదాలు నిర్వహించారు. ప్రధానంగా టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్, పారిశుధ్య విభాగాలకు సంబంధించి పైళ్లను స్వాధీనం చేసుకొని పూర్తిస్థాయిలో తనిఖీలు చేశారు.
శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో అక్రమ నిర్మాణాలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేస్తూ అధికారులు భారీ మొత్తంలో ముడుపులు తీసుకొని అక్రమాల కు పాల్పడ్డారనే ఆరోపణల నేపధ్యంలో ఏసీబీ అధికారులు ఈ తనిఖీలు చేశారు. ప్రధానంగా సర్కిల్ కార్యాలయంలోని టౌన్‌ప్లానింగ్ విభాగంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, అక్ర మ కట్టడాలపై వచ్చిన ఫిర్యాదులు, అధికారులు తీసుకున్న చర్యలకు సంబంధించి కీలక ఫైళ్లను, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అధికారుల బృందం ఈ సోదాలు చేపట్టింది.
అవినీతిపై ఫిర్యాదులతోనే తనిఖీలు
జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి కార్యాలయం లో అవినీతి అక్రమాలు జరుగుతున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయని, ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో అధికారులు పలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యం లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ఆకస్మిక సోదాలు నిర్వహించినట్లు రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ పేర్కొన్నారు. ప్రధానంగా టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్, పారిశుధ్య విభాగాల్లో ఈ సోదాలు చేపడుతున్నట్లు తెలిపారు. తనిఖీల్లో ఎలాంటి నగదు లభించనప్పటికీ ప్రాథమికంగా పలు అక్రమాలకు సంబంధించి కొన్ని లోపాలను గుర్తించినట్లు తెలిపారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయని రికార్డులన్నింటినీ పూర్తిస్థాయిలో పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదికను అందజేయ నున్నట్లు పేర్కొన్నారు.