పెద్దేముల్, జనవరి 20 : గ్రామాల్లో ఉన్న ఉపాధి హామీ కూలీల జాబ్‌కార్డులకు ఆధార్ కార్డు సీడింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఎంపీడీవో లక్ష్మప్ప, ఎంపీవో షేక్ సుష్మా పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో జాబ్‌కార్డులకు ఆధార్ కార్డు సీడింగ్ ప్రక్రియపై ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని 37 గ్రామాల్లో మొత్తం 18,982 ఉపాధి కూలీల జాబ్‌కార్డులు అందుబాటులో ఉండగా ఇప్పటివరకు కలెక్టర్ ఆదేశాల మేరకు 12,633 జాబ్‌కార్డులకు ఆధార్ సీడింగ్ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. మిగతా 6,349 జాబ్‌కార్డులకు ఆధార్ కార్డు సీడింగ్ చేయాల్సి ఉందన్నారు.
మండలంలోని గిర్మాపూర్, బండపల్లి, చైతన్యనగర్, జయరాంతండా(ఇ), ఖానాపూర్, రేగొండి గ్రామాల్లో ఆధార్ కార్డు సీడింగ్ పూర్తయిందని తెలిపారు. మంబాపూర్, పెద్దేముల్, జనగాం గ్రామాల్లో సీడింగ్ ప్రక్రియ పెండింగ్‌లో ఉందన్నారు. పంచాయతీ కార్యదర్శులకు ఉపాధి హామీ కూలీలు ఆధార్‌కార్డు, జాబ్‌కార్డు జిరాక్స్ కాపీలను అందించి సీడింగ్ ప్రక్రియకు సహకరించాలని కోరారు. ఈ ప్రక్రియ పూర్తికాకపోతే ఉపాధి హామీ పనులు చేసే అవకాశాన్ని కూలీలు కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఈసీ కృష్ణ, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.