పెద్దఅంబర్‌పేట, అక్టోబర్ 27 : అబ్దుల్లాపూర్‌మెట్ మయూరికాంట సమీపంలోని హైటెన్షన్ టవరెక్కిన ఓ గుర్తు తెలియని యువకుడు హంగామా చేశాడు. ఆపై కిందికి దూకి తీవ్రంగా గాయపడి.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసుల కథ నం ప్రకారం.. ఉత్తర భారతదేశానికి చెందిన 35 ఏండ్ల ఓ యువకుడు సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో హైటెన్షన్ టవరెక్కాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని.. విద్యుత్తు, అగ్నిమాపక శాఖల అధికారులకు సమాచారమిచ్చారు. అధికారులు టవర్‌పైకి ఎక్కి కాపాడేందుకు యత్నించగా.. పైకి వస్తే దూకేస్తానని బెదిరించడంతో వెనక్కి తగ్గారు.
మధ్యా హ్నం 3 గంటల ప్రాంతంలో విద్యుత్తు, అగ్నిమాపక శాఖల అధికారులు.. హైటెన్షన్ టవర్ పైకి ఎక్కి ఆ యువకుడిని కాపాడే యత్నం చేయగా.. చేతులు పట్టుకోగానే.. అతడు ఝుళిపించుకోవడంతో కిందపడి తీవ్రంగా గాయపడ్డా డు. వెంటనే అతడ్ని ఉస్మానియా దవాఖానకు తరలించగా అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. హిందీలో మాట్లాడటంతో అతడు బీహార్ లేదా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన యువకుడి అయి ఉంటాడని.. అతడు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడు ఎందుకు టవరెక్కాడు? అతడి వ్యక్తిగత వివరాలేవీ లభించలేదన్నారు.