Suicide Attempt | షాబాద్, ఫిబ్రవరి 21: తన స్నేహితురాలు తనతో మాట్లాడటం లేదని పదో తరగతి విద్యార్థిని స్పిరిట్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన షాబాద్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. షాబాద్‌లోని ఆమనగల్లు గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుకుంటున్న శ్రీజ అనే విద్యార్థిని తన తోటి స్నేహితురాలు తనతో మాట్లాడటం లేదని శుక్రవారం ఉదయం స్పిరిట్ తాగింది.
ఇది గమనించిన పాఠశాల ఉపాధ్యాయులు ఆ విద్యార్థినిని చికిత్స నిమిత్తం నగరంలోని ఉస్మానియా దవఖానకు తరలించారు. ప్రస్తుతం విద్యార్థినికి చికిత్స జరుగుతుందని, ఆమె ఆరోగ్యం బాగానే ఉందని అక్కడి వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న షాద్‌నగర్ డివిజన్ డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ విజయలక్ష్మి, స్థానిక మండల విద్యాశాఖ అధికారి లక్ష్మణ్‌నాయక్, సీఐ కాంతారెడ్డి, ఎస్ఐ రమేశ్‌లు పాఠశాలకు చేరుకుని ప్రిన్సిపాల్ వినోలతో పాటు ఉపాధ్యాయులతో, విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తన స్నేహితురాలు తనతో మాట్లాడకపోవడంతోనే విద్యార్థిని స్పిరిట్ తాగిందని, వెంటనే దవఖానకు తీసుకువెళ్లిన్నట్లు, విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని బాగానే ఉన్నట్లు ప్రిన్సిపాల్ వినోల మీడియాకు తెలిపారు.