చేవెళ్ల రూరల్/చేవెళ్లటౌన్, ఆగస్టు 28 : చేవెళ్ల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం.. రోగులకు ప్రాణసంకటంగా మారుతున్నది. దీంతో వైద్యం కోసం వచ్చే పేదలకు ఇబ్బందులు తప్పడం లేదు. బుధవారం మండలంలోని మలాపూర్ గ్రామానికి చెందిన పదేండ్ల మహేశ్వరి అనే చిన్నారిని ఆమె తల్లి చేవెళ్ల ప్రభుత్వ దవాఖానకు తీసుకొచ్చింది. వైద్యుడికి చూపించగా.. పలు మందులను రాశాడు. ఆ ప్రిస్క్రిప్షన్‌ను తీసుకుని నేరుగా ఫార్మసీ వద్దకు వెళ్లగా అక్కడి సిబ్బంది.. డాక్టర్ రాసిన మందులు కాకుండా వేరే మందులను ఆమెకు ఇచ్చారు.
ఇదే విధంగా పలువురు రోగులకు కూడా ఆ సిబ్బంది వేరే మెడిసిన్ ఇచ్చారని.. వైద్యం వికటించి ప్రాణాలకు ఆపాయం జరిగితే ఎవరూ బాధ్యత వహిస్తారని రోగులు, వారి సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత వైద్యులు అందుబాటు లో లేనప్పుడు ఏమైనా క్రిటికల్ కేసులొస్తే ట్రైనీ వైద్యులే వైద్యం అందిస్తున్నారని పేర్కొంటున్నారు. ఆస్పత్రిలో వైద్యులందరూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.
రెస్ట్‌లో ఫార్మాసిస్టులు.. డ్యూటీలో 104 ఉద్యోగి..
డ్యూటీ చేయాల్సిన ఫార్మాసిస్టులు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఫార్మసీ గ్రేడ్-1 ఉద్యోగి అయిన ముక్తార్ హైమద్, ఫార్మసీ గ్రేడ్-2 ఉద్యోగిణి అరుణ విధులు నిర్వహించకుండా 104 ఉద్యోగితో మందులు ఇప్పిస్తున్నారు. ఫార్మసీకి సంబంధం లేని వారు చీటీలు చూస్తూ ఇచ్చిన మందులు వేరేవిగా ఉండడంతో రోగులు తిరిగి వచ్చి ఇదేంటని ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలిస్తూ దబాయిస్తున్నారు.
విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలే..
ఈ విషయమై చేవెళ్ల ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ రాజేంద్రప్రసాద్‌ను వివరణ కోరగా.. విధుల్లో నిర్లక్ష్యం చేసే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందేలా ప్రతి ఒకరూ అంకితభావంతో పని చేసేలా చూస్తామని పేర్కొన్నారు.