వికారాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఎస్ఐఆర్(ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) ప్రక్రియ పకడ్బందీగా జరుగుతున్నది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లా అధికార యంత్రాంగం ఎస్ఐఆర్పై ప్రత్యేక దృష్టి సారించింది. అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా గల్లంతు కాకుండా తగు చర్యలు చేపట్టింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటికే సర్ ప్రక్రియపై బీఎల్వోలకు ప్రత్యేకంగా రెండుసార్లు శిక్షణ కూడా ఇచ్చారు. జూన్ 25 నుంచి ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ ప్రారంభంకాగా దాదాపు ముగిసింది. ఈ నెల 24 వరకు ఎన్యుమరేషన్ ఫారాలను భర్తీ చేసి సంబంధిత పోలింగ్ బూత్ అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది.
మరోవైపు పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ర్టాల్లో లక్షల్లో ఓట్లు గల్లంతయ్యాయని ఆయా రాష్ర్టాల్లోని పలు పార్టీలు చేస్తున్న ఆరోపణల దృష్ట్యా ఓటర్లలో ఆందోళన నెలకొన్నది. ఓటర్లు ఎలాంటి ఆందోళన చెందకుండా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలోని 1133 పోలింగ్ బూత్‌లలో బీఎల్వోలను నియమించారు. ఎన్యుమరేషన్ ఫారాలను ఇంటింటికి పంపిణీ చేసే ప్రక్రియ మొదలు, ఫారాల భర్తీ వరకు బీఎల్వోలు ఎలాంటి తప్పులు దొర్లకుండా ఏ ఒక్క ఓటరుకూ నష్టం జరగకుండా జిల్లా ఎన్నికల అధికారులు తగు చర్యలు చేపట్టారు.
జిల్లాలో సర్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతున్నది, ఎన్యుమరేషన్ ఫారాలను ఓటర్లందరికీ భర్తీ చేశారా, సర్ ఫారాల భర్తీలో ఓటర్లకున్న సందేహాలను ఎలా నివృత్తి చేస్తున్నారు, సర్ ఫారంలో తప్పులు దొర్లితే ఏం చేయాలి, ఓటర్లు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లయితే ఏం చేస్తారు, డిజిటలైజేషన్లో వెనుకబడి ఉన్న జిల్లాలో వేగవంతం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే దానిపై కలెక్టర్ దీపక్ తివారీతో నమస్తే తెలంగాణ ప్రతినిధి ప్రత్యేక ఇంటర్వ్యూ..
కలెక్టర్ : జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పకడ్బందీగా జరిగేలా చర్యలు చేపట్టాం. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ దాదాపు పూర్తయింది. వలస వెళ్లిన ఓటర్లు, మరణించిన ఓటర్లు మినహా మిగతా ఓటర్లందరికీ ఇంటింటికీ వెళ్లి బీఎల్వోలు అందజేశారు. జిల్లాలో ఇప్పటివరకు సర్ ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ 95.75 శాతం పూర్తయింది. జిల్లాలో 10,17,671 మంది ఓటర్లుండగా.. ఇప్పటివరకు 9.74,374 ఓటర్లకు ఫారాలను పంపిణీ చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో 2,51,255 మందికి.., 2,49,009(99.11 శాతం) మంది ఓటర్లకు ఫారాల పంపిణీ., పరిగి నియోజకవర్గంలో 2,76,260 మందికి..2,60,578(94.32 శాతం) మంది., వికారాబాద్ నియోజకవర్గంలో 2,37,921 మందికి 2,24,508 (94.36 శాతం) మంది., తాండూరు నియోజకవర్గంలో 2,52,235 మంది ఓటర్లకు 2,40,279(95.26 శాతం) మంది ఓటర్లకు సర్ ఫారాలను బీఎల్వోలు అందజేశారు.మరోవైపు ఉర్దూ మాట్లాడేవారికి కూడా అర్థమయ్యేలా ప్రత్యేకంగా డమ్మీ ఫారాలను కూడా పంపిణీ చేస్తున్నాం.
కలెక్టర్ : జిల్లాలో మ్యాపింగ్ పూర్తైన ఓటర్ల డిజిటలైజేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేసేలా చర్యలు చేపట్టాం. వారం రోజుల్లో 50 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు అవసరమైన తగు చర్యలు చేపట్టాం. ఇప్పటికే ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిన దృష్ట్యా ఓటర్ల ద్వారా ఎన్యుమరేషన్ ఫారాలను సేకరించే ప్రక్రియను వేగవంతం చేసేలా బీఎల్వోలను ఆదేశిస్తాం. ఇప్పటివరకు 77.65 శాతం మేర ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయింది. జిల్లాలో 10,17,671 మంది ఓటర్లుండగా.. 7,85,495 మంది ఓటర్లకు సంబంధించి మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. పరిగి నియోజకవర్గానికి సంబంధించి 84.08 శాతం పూర్తికాగా.. 2,32,111 మందికి., వికారాబాద్ నియోజకవర్గంలో 79.98 శాతం పూర్తికాగా.. 1,84, 674 మందికి., తాండూరు నియోజకవర్గంలో 66.29 శాతం పూర్తికాగా.. 1,65,637 మందికి., కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి 79.78 శాతం పూర్తికాగా.. 2,00,073 మంది ఓటర్లకు మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేశారు.
కలెక్టర్ : జిల్లాలోని ఏ ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కును కోల్పోకుండా అవసరమైన తగు చర్యలు చేపట్టడంతోపాటు బీఎల్వోలకు ప్రత్యేకంగా శిక్షణనిచ్చాం. ఎన్యుమరేషన్ ఫారాలను భర్తీ చేసే ముందు తప్పనిసరిగా బీఎల్వోలను సంప్రదించి మాత్రమే ఓటర్ల వివరాలను భర్తీ చేయాలి. ఎన్యుమరేషన్ ఫారాల భర్తీలో ఓటర్లకు ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రత్యేకంగా వలంటీర్లను కూడా నియమించాం. వలంటీర్ల ద్వారా ఓటర్లకు ప్రతీ పోలింగ్ బూత్‌లో సర్ ఫారాల భర్తీపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాం.
కలెక్టర్ : ఎన్యుమరేషన్ ఫారంలో తప్పులు దొర్లకుండా జాగ్రత్తగా బీఎల్వోలు, ఎన్నికల సంఘం సూచనలను పాటిస్తూ భర్తీ చేయాలి. 2002 ఓటరు జాబితాతోపాటు 2025 ఓటరు జాబితాను బీఎల్వోలకు అందించి.. 2002 ఓటరు జాబితా ఆధారంగా ప్రతీ ఇంటికి వెళ్లి పాత లిస్ట్‌లోని పేర్లను కొత్త జాబితాలోనూ ఉన్నట్లయితే మ్యాపింగ్ చేస్తున్నారు. 2002లో ఓటరు జాబితాలో పేరు లేకుండా ప్రస్తుతం ఓటరు జాబితాలో పేరు ఉన్నట్లయితే అప్పటి జాబితాలో కుటుంబీకుల పేరు ఉన్నట్లయితే వారిని ఆధారంగా తీసుకొని మ్యాపింగ్ చేస్తున్నారు. 2002 ఓటరు జాబితాలో ఉన్నట్లయితే వివరాలను ఎడమ వైపు, 2002 ఓటరు జాబితాలో ఓటరు వివరాలు లేకుండా కుటుంబసభ్యుల వివరాలున్నట్లయితే కుటుంబసభ్యుల వివరాలను కుడి వైపు బాక్సులో భర్తీ చేయాలి.
కలెక్టర్ : ఎన్యుమరేషన్ ఫారంలో ఏవైనా తప్పులు దొర్లినప్పటికీ కింద డిక్లరేషన్‌లో సరైన వివరాలను భర్తీ చేసినట్లయితే డిజిటలైజేషన్ సమయంలో బీఎల్వోలు సరైన వివరాలను భర్తీ చేస్తారు
కలెక్టర్ : ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీలో భాగంగా మూడుసార్లు బీఎల్వోలు సదరు ఓటరు ఇంటికి వెళ్తారు, అయినప్పటికీ ఇంటికి తాళం ఉన్నట్లయితే సంబంధిత ఓటర్లు వలస వెళ్లినట్లుగా ఎన్యుమరేషన్ ఫారంలో వివరాలను నమోదు చేస్తారు.
కలెక్టర్: 2002 ఓటరు జాబితాలో పేరు లేకుండా, కుటుంబ సభ్యుల పేర్లు కూడా లేనివారికి ప్రత్యేకంగా డిక్లరేషన్ ఫారాన్ని సంబంధిత ఓటర్లకు అందజేస్తాం. డిక్లరేషన్ ఫారాన్ని భర్తీ చేసి ఎన్నికల సంఘం సూచించిన 12 గుర్తింపు కార్డులైన ఆధార్, బర్త్ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్., గుర్తింపు పొందిన బోర్డులు, యూనివర్సిటీలు జారీ చేసిన విద్యా సర్టిఫికెట్లు., ప్రభుత్వం జారీ చేసిన భూమి లేదా ఇంటి కేటాయింపు పత్రం., రాష్ట్రం లేదా స్థానిక సంస్థలు తయారుచేసిన కుటుంబ రిజిస్టర్., ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ లేదా ఇతర ధ్రువీకరణ పత్రం తదితర గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక గుర్తింపు కార్డును జత చేసి బీఎల్వోలకు అందజేయాలి.
కలెక్టర్: సర్ ఎన్యుమరేషన్ ఫారంలో ఏ వివరాలైతే నమోదు చేస్తారో సంబంధిత వివరాలను బీఎల్వోలు మ్యాపింగ్ చేస్తారు. మరో చోట ఉన్న ఓటుకు మ్యాపింగ్ జరగదు కాబట్టి ముసాయిదా జాబితా ప్రకటించిన అనంతరం నోటీసులిచ్చి స్పందించనట్లయితే జాబితా నుంచి తొలగిస్తారు.
కలెక్టర్ : ఓటరు ఇల్లు మారినట్లయితే కొత్త ఇంటి అడ్రస్‌ను ఎన్యుమరేషన్ ఫారంలో భర్తీ చేయవచ్చు. బీఎల్వోల వద్ద ఫారం-8 తీసుకొని కొత్త అడ్రస్ వివరాలను భర్తీ చేసి బీఎల్వోలకు అందజేయాలి.