ఇబ్రహీంపట్నంరూరల్, డిసెంబర్ 2 : ఇబ్రహీంపట్నం మండలంలోని రాయపోల్ గ్రామంలో జరిగిన కులోన్మాద హత్య సంచలనం రేపింది. సోమవారం ఉదయం హత్య జరిగిన విషయం తెలియడంతో పలువురు దిగ్భ్రాంతికి గురయ్యారు. సొంత అక్కను తమ్ముడు చంపిన విషయం తెలియడంతో రాయపోల్, పోల్కంపల్లి, దొండగూడ, మందగూడ, లింగంపల్లి, నాగన్‌పల్లి, దండుమైలారం, ముకునూరు గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. తల్లిదండ్రులు చనిపోయినప్పటికీ నాగలక్ష్మి(26) పట్టుదలతో పోలీసుకానిస్టేబుల్ ఉద్యోగం సాధించింది. అంతలోనే హత్యకు గురికావడం గ్రామవాసులను కలచివేసింది.
కొంత కాలం క్రితం నాగలక్ష్మి తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతి చెందారు. నాగలక్ష్మికి ఒక అక్క, తమ్ముడు ఉన్నారు. తల్లిదండ్రులు చనిపోయినప్పటికీ పట్టుదలగా చదివి 2022బ్యాచ్‌లో కానిస్టేబుల్‌గా ఎంపికైంది. ఉద్యోగం చేస్తూనే అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ను కులాంతర వివాహం చేసుకున్నది. ఇది నచ్చని ఆమె సోదరుడు పరమేశ్ ఆమెను ఎలాగైనా హత్య చేయాలని అనుకున్నాడు. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఒంటరిగా ఉద్యోగానికి వెళ్తున్న విషయం తెలుసుకున్న పరమేశ్ కారుతో ఆమెను వెనుకనుంచి ఢీకొట్టి.. కిందపడిపోగానే విచక్షణా రహితంగా కత్తితో గొంతుకోసి హత్య చేశాడు.
ఈ ఉదంతంతో నాగలక్ష్మి భర్త శ్రీకాంత్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ భార్యను చంపిన ఆమె తమ్ముడు పరమేశ్‌ను కఠినంగా శిక్షించాలని, నేటికీ కులాల ప్రస్తావనతో హత్య చేయడం బాధాకరమని భర్త వాపోయాడు. శవపంచనామా పూర్తి చేసిన పోలీసులు మృతురాలు నాగలక్ష్మి మృతదేహాన్ని భర్త కుటుంబసభ్యులకు అందజేశారు. నాగలక్ష్మిని హత్య చేసిన ఆమె సోదరుడు పరమేశ్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు తెలిసింది. హంతకుడిని కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు సామ్యూల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఎదుట సాగర్ రహదారిపై ధర్నా నిర్వహించారు.