రంగారెడ్డి, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని ఆమనగల్లు, తలకొండపల్లి, మా డ్గుల, కడ్తాల్ మండలాల్లోని సుమారు 40 వేల ఎకరాలకు శాశ్వతంగా సాగునీరు అందిం చాల నే సదుద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన కల్వకుర్తి ఎత్తపోతల పథకంపై ప్రభుత్వం కపట ప్రేమ చూపుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 27 నెలలు దాటినా కల్వకుర్తి ప్రాజెక్టు కాల్వలకు చుక్కనీరు ఇవ్వలే దు. అలాగే, మిగిలిపోయిన పెండింగ్ పనుల పూర్తికీ నయాపైసా మంజూరు చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగమైన గుడిపల్లిగట్టు, 29వ ప్యాకేజీ నుంచి కల్వకుర్తి, ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల మండలాలకు సుమా రు రూ.182 కోట్లతో కాల్వల ద్వారా నీరందించే పనులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకా రం చుట్టింది. గుడిపల్లిగట్టు రిజర్వాయర్-జంగారెడ్డిపల్లి డిస్టిబ్యూషన్ కెనాల్ నుంచి ఆమనగల్లు, పోలేపల్లి, సింగంపల్లి, మల్లేపల్లి, అవుర్పల్లి, దొడ్లపాడు, నాగిళ్ల గ్రామాల మీదుగా కాల్వలు తవ్వి వాటి ద్వారా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు నీరందించే బృహత్ ప్రణాళికకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ చొరవతో ఈ పథకాన్ని దాదాపుగా పూర్తిచేసి నీటిని విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయగా.. అప్పు డే.. అసెంబ్లీ ఎన్నికలొచ్చి.. అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడంతో ఈ పథకానికి గ్రహణం పట్టింది. అధికారులు స్పందించి జంగారెడ్డిపల్లి రిజర్వాయర్ నుంచి జిల్లాకు సాగునీరు అందించాలని ప్రజలు కోరుతున్నారు.
కాల్వలకు సాగునీరు ఇవ్వాలని అసెంబ్లీలో కోరిన ఎమ్మెల్యే ..
జిల్లాలోని పలు మండలాలకు సాగునీరు అందించే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తికి, అలాగే, కాల్వల మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వా న్ని వేడుకున్నారు. అయినా సర్కార్ మాత్రం నీటి విడుదలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. గత ప్రభుత్వం సుమారు 40 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే సదుద్దేశంతో కల్వకుర్తి ప్రాజెక్టును చేపట్టింది. కొంతమేర కాల్వలను తవ్వించింది. కాగా, ఆ కాల్వలు పూర్తిగా ఎండిపోయి పిచ్చిమొక్కలు మొలిచి పనికి రాకుండా పోయాయి. ప్రభుత్వం స్పందించి జిల్లాలోని నాలుగు మండలాలకు వెంటనే సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
రిజర్వాయర్ ద్వారా నీరొచ్చే గ్రామాలు..
కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగమైన జంగారెడ్డిపల్లి డిస్టిబ్యూషన్ కెనాల్ ద్వారా ఆమనగల్లు, పోలేపల్లి, సింగంపల్లి, మల్లేపల్లి, అవుర్పల్లి, దొడ్లపాడు, నాగిళ్ల గ్రామాల మీదుగా సాగునీటి కాల్వ పనులు చేపట్టారు. ఈ కాల్వకు చుట్టు పక్కల ఉన్న గ్రామాలకు కూడా సాగునీరు అందేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. డిస్టిబ్యూషన్ కెనాల్ 82 నుంచి జంగారెడ్డిపల్లి మీదుగా జిల్లాలోకి వచ్చే ఆయకట్టు కాల్వకు కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయీ ఇవ్వలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కసిరెడ్డి నారాయణరెడ్డి అధికారంలోకి రాగానే కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగమైన కాల్వలకు మరమ్మతులు చేయించి పంటలకు సాగునీరు అందించేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. కానీ, పవర్లోకి వచ్చి 27 నెలలు దాటినా మిగిలిపోయిన కాల్వలను పూర్తిచేయటంతోపాటు ఉన్న కాల్వలను మరమ్మతు చేసేందుకు సర్కార్ పైసా నిధులూ ఇవ్వలేదు.
కేఎల్‌ఐపై ప్రభుత్వం చిన్నచూపు..
కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నది. ప్రాజెక్ట్ పనులు పూర్తైనా రైతులకు సాగునీటిని అందించడంపై శ్రద్ధ చూపకపోవడంతో ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల్ మండలాల్లోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి వ్యవసాయ పొలాలను నీటిని అందించాలి.
-జైపాల్‌యాదవ్, మాజీ ఎమ్మెల్యే,కల్వకుర్తి..కడ్తాల్