రంగారెడ్డి, జూలై 29 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిపై ఫిర్యాదుల పర్వం కొనసాగుతున్నది. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారికి.. ఇతర సిబ్బందికి మధ్య అంతర్గత విభేదాలు జోరందుకున్నాయి. టీఎన్జీఓ ఆధ్వర్యంలో ఉద్యోగులంతా వారం రోజుల్లో రెండోసారి వైద్యారోగ్యశాఖ మంత్రిని కలిసి డీఎంహెచ్ఓపై ఫిర్యాదు చేశారు. వైద్యారోగ్యశాఖ అధికారి తీరుపై వెంటనే దర్యాప్తు జరిపించి ఆమెను తప్పించాలని ఉద్యోగులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తమపై డీఎంహెచ్ఓ వేధింపులు అధికమయ్యాయని ఉద్యోగులు వాపోతున్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఆమె అధికారాన్ని అడ్డం పెట్టుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిజాయితీగా పనిచేస్తున్న ఉద్యోగులను టార్గెట్ చేసి బదిలీలతోపాటు మెమోలు ఇచ్చి వేధిస్తున్నారని వాపోతున్నారు.
ఉద్యోగుల మధ్య కయ్యాలు.. వైద్య సేవలకు ఆటంకం
జిల్లా వైద్యాశాఖ అధికారికి.. ఇతర ఉద్యోగులకు గత నెల రోజులుగా ఆరోపణలు.. ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పీహెచ్సీ డాక్టర్లు, డిప్యూటీ డీఎంహెచ్వోలు, ఇతర కిందిస్థాయి సిబ్బంది డీఎంహెచ్వో తీరుపై గుర్రుగా ఉన్నారు. దీంతో ఆస్పత్రుల్లో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. వైద్యారోగ్యశాఖ అధికారి వేధింపులతో పలువురు డాక్టర్లు కూడా సెలవులపై వెళ్తున్నారని, దీంతో పీహెచ్సీల్లో వైద్యసేవలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జిల్లాలో వైద్యులతోపాటు ఇతరత్రా సిబ్బంది కొరత కూడా తీవ్రంగా ఉన్నది. మరోవైపు బస్తీ దవాఖానల్లో కూడా వైద్య సేవలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. మరోవైపు జిల్లావ్యాప్తంగా సీజనల్ వ్యాధులు, విషజ్వరాలు ప్రబలి ప్రజలు మంచాన పడుతున్నారు. ఈ పరిస్థితిలో వారికి పూర్తిస్థాయి వైద్యసేవలు అందించాల్సిన సమయంలో సిబ్బంది మధ్య గొడవలు రోగులకు అందించే వైద్యసేవలకు ఆటంకం కలిగే పరిస్థితి వచ్చింది.
దర్యాప్తునకు ఆదేశించిన మంత్రి
తమపై కక్షపూరిత విధానాలకు పాల్పడుతున్న జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిపై వెంటనే చర్యలు తీసుకుని.. ఆమెను తప్పించాలని కిందిస్థాయి ఉద్యోగులు గత వారం రోజుల్లో రెండోసారి వైద్యారోగ్యశాఖ మంత్రిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాలపై విచారణ జరిపి తమకు నివేదిక ఇవ్వాలని ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శిని మంత్రి ఆదేశించారు. డీఎంహెచ్ఓపై చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని ఉద్యోగులు చెప్తున్నారు. మంత్రిని కలిసినవారిలో టీఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్, ప్రధాన కార్యదర్శి హుస్సేన్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు యశ్వంత్, కార్యదర్శి శ్రీనివాస్, వైద్యారోగ్యశాఖ ఉద్యోగులున్నారు.